ప్రతిపక్షాలపై విమర్శలకు ఎర్ర కోట వేదిక
అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా పోరాటం
మళ్లీ మేమే వస్తాం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులకు వ్యతిరేకంగా పోరాడతానంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాత పాటే పాడారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 90 నిమిషాలసేపు సాగిన ఆయన ప్రసంగం ఆసాంతం ఎన్నికల ప్రసంగాన్ని తలపించింది. వచ్చే ఆగస్టు 15 నాటికి మళ్లీ తామే వస్తామని ఆయన జోస్యం చెప్పారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ''పారదర్శకత, నిష్పాక్షికత''ను బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. అవినీతి, బంధుప్రీతి (పరివార్వాద్ ), బుజ్జగింపులు దేశాన్ని వెనుకకు లాగుతున్న ''వ్యాధులు'' గా ఆయన అభివర్ణించారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత దేశం నిలుస్తుందని అన్నారు. 13.5 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి బయట పడేశామని ప్రధాని చెప్పారు. వారంతా మధ్య తరగతికి బలంగా మారారని సెలవిచ్చారు.
మహిళలు లక్షాధికారులుగా..
మహిళా స్వయం సహాయక బృందాల కృషిని మోడీ ప్రశంసించారు. నేడు మహిళా స్వయం సహాయక బృందాల్లో 10 కోట్ల మంది మహిళలు ఉన్నారని, మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరిగితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. పౌర విమానయాన రంగంలో మహిళా పైలట్లు ఉన్నారని, మహిళలు శాస్త్రవేత్తలు అవుతున్నారని చెప్పడం గర్వంగా ఉందన్నారు.. చంద్రయాన్ కార్యక్రమానికి మహిళా శాస్త్రవేత్తలు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యాన్ని జీ20 దేశాలు గుర్తించాయన్నారు.
- యువతకు మెరుగైన భవిత
దేశంలో యువతకు మెరుగైన భవితను కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో అవకాశాలకు కొరత లేదన్నారు. మన యువత ప్రపంచంలో మొదటి మూడు స్టార్టప్ ఇకోసిస్టమ్స్‌లో ఒకదానిగా దేశాన్ని తీసుకెళ్లారని తెలిపారు. మన దేశ సైనిక దళాలు నూతన జవసత్త్వాలతో, యుద్ధ సన్నద్ధతతో ఉండేలా నిరంతరం సంస్కరణలు జరుగుతున్నాయని చెప్పారు.
సంక్షేమ పథకాలను పొందుతున్న 10 కోట్ల మంది బూటకపు లబ్ధిదారులను తొలగించామన్నారు.. అక్రమాస్తుల జప్తు 20 రెట్లు పెరిగిందన్నారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన రంగంలో దేశ సామర్థ్యం వేగంగా పెరుగుతోందన్నారు. డీప్ సీ మిషన్, రైల్వేల ఆధునికీకరణ, వందే భారత్ రైలు, బుల్లెట్ రైలు... ఇలాంటివాటి కోసం మనం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. నానో యూరియా కోసం కృషి చేస్తున్నామని, ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టామని చెప్పారు.
- మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు కృషి
మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ప్రధాని చెప్పారు. గత కొన్ని వారాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా మణిపూర్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దేశ ఆడబిడ్డల గౌరవ, మర్యాదలకు తీవ్ర భంగం కలిగిందని అన్నారు. యావద్భారతావని మణిపూర్ రాష్ట్రానికి, ప్రజలకు అండగా ఉందని తెలిపారు. ఈ ఏడాది చాలా రాష్ట్రాలు అనూహ్యమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని అన్నారు. ఈ సవాలును అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేస్తాయని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ కొన్ని పథకాలు ప్రకటించారు.
- విశ్వకర్మ పథకం
వచ్చే నెల నుంచి రూ.13 వేల కోట్లతో విశ్వకర్మ పథకాన్ని ప్రారంభిస్తామని మోడీ తెలిపారు. క్షురక వృత్తి, బట్టలు ఉతకడం, బంగారు ఆభరణాలు తయారు చేయడం వంటి సంప్రదాయ నైపుణ్యాలుగలవారికి ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
- చౌక ధరకు మందులు
జన ఔషధి కేంద్రాలను 10 వేల నుంచి 25 వేలకు పెంచాలని తన ప్రభుత్వం ప్రణాళిక రచించిందని చెప్పారు. జనరిక్ మందులు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. మధుమేహ రోగగ్రస్థులు నెలకు రూ.3,000 వరకు ఖర్చు చేయవలసి వస్తోందని, రూ.100 విలువైన మందులు జన ఔషధి కేంద్రాల్లో రూ.10 నుంచి రూ.15కే అందుబాటులో ఉంటాయని చెప్పారు.
- సొంతింటి కల
పట్టణాలు, నగరాల్లో తమకు ఓ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటున్నవారి కోసం తన ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెడుతోందన్నారు. నగరాల్లో నివసిస్తూ, సొంత ఇల్లు లేని మధ్య తరగతి ప్రజలకు బ్యాంకు రుణాల్లో ఉపశమనం కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
- ధరాభారం పడకుండా..
ద్రవ్యోల్బణం పెరుగుతున్నందు వల్ల ప్రజలపై ధరల భారం అతి తక్కువగా ఉండేలా చూడటం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడంలో తన ప్రభుత్వం కొంత వరకు విజయం సాధించిందని చెప్పారు.
తొలిత ప్రధాని మోడీకి ఎర్రకోట వద్ద రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సహాయ మంత్రి అజరు భట్, కార్యదర్శి గిరిధర్ అరమానే తదితరులు స్వాగతం పలికారు. ప్రధాని జాతీయ జెండాను పూల వర్షం కురిపించిన భారత వైమానిక దళానికి చెందిన మార్క్-××× ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు ఆవిష్కరించాయి. ఎర్రకోట వద్ద పుష్పాలంకరణలో విశేషాకర్షణగా జి-20 లోగో నిలిచాయి. ఎర్రకోటకు చేరుకునే ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని మోడీ నివాళులర్పించారు.
ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాల నుంచి సుమారు 1,800 మంది ప్రత్యేక అతిథులుగా పాల్గన్నారు. 'జన భాగస్వామ్యం' పేరిట వీరికి ఆహ్వానం పంపారు. ఉజ్వల గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు సహా 660 మందిని పైగా హాజరయ్యారు. రైతు ఉత్పత్తిదారు సంస్థల నుంచి 250 మంది, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం, ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం కింద 50 మంది, కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గన్న 50 మంది కార్మికులు, సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత సరోవరాల తవ్వకం, ఇంటింటికీ నీరు పథకంలో పాల్గన్న కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారుల నుంచి 50 మంది చొప్పున ప్రత్యేక అతిథులుగా పాల్గోన్నారు.
- ఖర్గే కుర్చీ ఖాళీగా దర్శనం
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గనలేదు. ఈ సభలో ఆయన కోసం కేటాయించిన కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. అయితే ఆయన ఓ రికార్డెడ్ మెసేజ్‌ని పంపించారు. గత కాలపు ప్రధాన మంత్రులు పోషించిన పాత్రను ఆ మెసేజ్‌లో వివరిస్తూ, ప్రస్తుత ప్రధాని మోడీ ప్రతిపక్షాలను వెంటాడుతున్నారని దుయ్యబట్టారు. ఖర్గే కాంగ్రెస్ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం కొత్త కొత్త సాధనాలను మోడీ వాడుతున్నారని ఖర్చే విమర్శించారు. సిబిఐ, ఈడి, ఆదాయపు పన్ను శాఖ దాడులు మాత్రమే కాకుండా ఎన్నికల కమిషన్‌ను కూడా బలహీనపరిచారన్నారు. ప్రతిపక్ష ఎంపిలపై దౌర్జన్యం చేస్తున్నారని, సస్పెండ్ చేస్తున్నారని, మైకులను పనిచేయనివ్వడం లేదని, ప్రసంగాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, అంతరిక్ష, అణు పరిశోధన సంస్థలు వంటివాటిని గతంలో ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ విషయాన్ని మరుగుపరుస్తోందని విమర్శించారు.










