Aug 14,2022 07:09

'స్వాతంత్య్రం అంటే బానిసత్వం నుంచి విడుదలే కాదు... కుల, సాంఘిక అసమానతలను తొలగించడం, మత వైషమ్యాలను నశింప జేయడం' అంటాడు సుభాష్‌ చంద్రబోస్‌. స్వాతంత్య్రం రాత్రికి రాత్రే వికసించే పుష్పం కాదు. స్వాతంత్య్రం అంటే ఆకాంక్ష. స్వాతంత్య్రం అంటే పరిపూర్ణత. కుల మత ప్రాంతీయ భేదాలు లేని ఆర్థిక సమానత. 'స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయంగా, ఆర్థికంగా తెచ్చుకునే మార్పుగా భావిస్తే దానికి మూల్యం మరికొన్ని తరాలు చెల్లించాల్సి ఉంటుంద'ని అంబేద్కర్‌ అప్పుడే హెచ్చరించాడు. సామాజిక పరివర్తన లేకుండా తెచ్చుకునే రాజకీయ, ఆర్థిక మార్పులు అధిక భాగం సామాన్య ప్రజలకు చేరువ కాలేవు. 'ఆర్థిక స్వాతంత్య్రం లేని వారికి... ఆత్మ స్వాతంత్య్రం ఎక్కడనుంచి వస్తుందో' అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు బుచ్చిబాబు. దేశంలోని ప్రతి వ్యక్తీ ఆర్థిక అసమానతలు లేని స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవించాలి. ఈ గాలి... ఈ నేల...నా ఊరు నా సొంతం అని స్వేచ్ఛగా తిరుగాడే పరిస్థితి వుండాలి. కానీ, ఇన్నాళ్ల తర్వాత మనం ఎక్కడున్నామని ప్రశ్నించుకుంటే... ఆవేదన, ఆగ్రహం, భరించలేని ఉక్కపోత తప్పదు. 'మలయజ శీతల పదకోమల భావన బాగున్నా/ కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది/ తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది' అంటారు సినారె. ఏ స్వాతంత్య్రం కోసమైతే దేశమంతా ఒక్కటై, గొంతులన్నీ ఏకమై... అడుగులన్నీ ఒక్క దిక్కుగా కదం తొక్కాయో...ఆ స్ఫూర్తి మెల్లమెల్లగా మాసకబారుతోంది.
             భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న తరుణమిది. స్వాతంత్య్రోద్యమంలో ఎలాంటి పాత్ర లేని ఆరెస్సెస్‌, దాని రాజకీయ విభాగమైన బిజెపి తిరంగ జెండా ఎగరవేయాలని ఆర్భాటం చేస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగరవేయని సంస్థ ఆరెస్సెస్‌. బ్రిటిష్‌ వారికి దాసోహమన్న ఈ సంస్థ, స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ మౌలిక విలువలను ధ్వంసం చేస్తున్నది. 'మన స్వతంత్రం మేడిపండు, మన దరిద్రం రాచపుండు' అని ఆరుద్ర రాసిన గీతం నేడు రుజువవుతోంది. దేశ స్వాతంత్య్రం కోసం ముందుండి పోరాడిన కార్మిక, కర్షకుల శ్రమ, త్యాగాలతో కలలుగన్న ఆ స్వేచ్ఛా భారతం ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. భారతదేశం ఇప్పటికీ విద్యా, వైద్యంలో వెనకబడే వున్నాం. చాలా పట్టణాలు, గ్రామాల్లో సరైన వైద్య సదుపాయాలుగానీ, పాఠశాలలు గానీ లేవు. సాధారణ ప్రజలకు...సంపన్న వర్గాలకు మధ్య అంతరం పెరిగిపోయింది. మరోవైపు మేధావులు, దళితులు, మైనారిటీలు, మహిళలపై దేశభక్తి పేరుతో, స్థానికత పేరుతో జరుగుతున్న దాడులు అభద్రతా భావాన్ని పెంచుతున్నాయి. వాక్‌ స్వాతంత్య్రం కుల, మత సమూహాల నుంచి నిరంతరం బెదిరింపులకు గురవుతోంది. ఇంకోవైపు పసిపిల్లలు తాగే పాలు నుంచి శ్మశానవాటికల వరకు పన్నులు వేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా ఇంటి అద్దెపై 18 శాతం జిఎస్‌టి విధించింది. దేశసంపదను, వనరులను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తోంది. అయినా, ఏ మాత్రం వెరపు లేకుండా వచ్చే 25 ఏళ్ళలో అన్నీ సాధించేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. ఏ దేశ చరిత్రలోనైనా 75 ఏళ్లంటే తక్కువ సమయమేమీ కాదు. పాలకులు చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఉంటే... ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, అసమానతలు వుండేవి కాదు. 'మత కలహాల మారణహోమాల మధ్య/ అర్ధరాత్రి ఆవిర్భవించిన స్వాతంత్య్రం/ అవినీతిని భారీ పరిశ్రమ చేసింది/ ఆకలికి సార్వభౌమాధికారం ఇచ్చింది/ ధనస్వామ్యానికి ప్రజాస్వామ్యం అని పేరు పెట్టి/ పేదవాళ్ళని మరింత పేదలనే చేసింది' అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఈ కాలంలో సంపదను కూడబెట్టుకున్న వాళ్లెందరు? కూలీలుగా మారుతున్నదెందరు? ఈ దేశం నాదేనా? అన్న అనుమానంతో నలిగిపోతున్న వారెందరు? స్వాతంత్య్రం సిద్ధించిన ఇన్నేళ్ల తర్వాత కూడా సందేహాస్పదంగా ఎన్నో ప్రశ్నలు. ఈ సందిగ్దతను తీర్చుకోవాల్సింది, తేల్చుకోవాల్సిందీ ప్రజలే. 'నా ఒక్కడి వల్లే ఈ దేశం మారిపోతుందా? అనుకునే ఏ ఒక్కడి వల్లా ఈ దేశానికి ఉపయోగం లేద'ని ఫైడల్‌ క్యాస్ట్రో అంటాడు. స్వాతంత్య్రం కూడా ఒక ఆకలే. ఈ స్వాతంత్య్రాన్ని ప్రేమలాగ ఎవరి మట్టుకు వారు ప్రతి నిత్యమూ గెలుచుకోవాలి. 75 ఏళ్ల అనుభవాలతో కొత్త దారులు ఏర్పరచాలి. 'దేవుడా! రక్షించు నా దేశాన్ని/ లక్షలాది దేవుళ్ళ నుండి/ వారి పూజల నుండి/ వారి వారి ప్రతినిధుల నుండి' అని తిలక్‌ ప్రార్థించాడు. కానీ ఈ దేశాన్ని రక్షించాల్సింది ప్రజలే. దేశ రక్షణ కోసం మరో స్వాతంత్య్ర పోరాటానికి సంసిద్ధం కావాల్సిందీ ప్రజలే.