Sep 19,2022 10:58

న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.7 లక్షల కోట్లు దాటినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయానికి పోలిస్తే 23.33 శాతం అధికమని తెలిపింది. ఆదివారం నాటికి ఈ ఏడాది నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.7,00,669 కోట్లుగా ఉన్నాయని, 2021లో సెప్టెంబరు 17 నాటికి రూ. 5,68,147 కోట్లు వసూళ్లు అయ్యాయని తెలిపింది. ఈ ఏడాది వసూలైన పన్నుల్లో కార్పొరేట్‌ పన్నులు రూ.3,68,484 కోట్లు, వ్యక్తిగత ఆదాయపన్ను, సెక్యూరిటీ లావాదేవీల పన్ను రూ.3.3 లక్షల కోట్లుగా వివరించింది. ప్రభుత్వం పన్ను ప్రక్రియలను సరళీకృతం చేయడం, క్రమబద్ధీకరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థించడం వినియోగించుకోవడంతో ఇది సాధ్యమయిందని చెప్పింది. స్థూల ప్రత్యక్ష పన్నుల ఆదాయం కూడా రూ.8,36,225 కోట్లకు చేరుకుందని, గత ఏడాదితో పోలీస్తే ఇది 30.2 శాతం అధికమని చెప్పింది. ఇందులో కార్పొరేషన్‌ పన్ను రూ. 4.36 లక్షల కోట్లుగా పేర్కొంది.