- లోగోను ఆవిష్కరించిన నేతలు
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : ఎల్‌ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎఒఐ) ఆరో జాతీయ మహాసభ వచ్చే నెల 22, 23న విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరగనున్నాయని మహాసభ ఆహ్వాన సంఘం చైర్మన్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు తెలిపారు. సోమవారం జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఎల్‌ఐసిని కాపాడుకోవాలి.. ఏజెంట్లను రక్షించుకోవాలి' అను నినాదంతో 2003లో సంఘం ఆవిర్భవించిందన్నారు. నాటి నుంచి నేటి వరకూ ఎల్‌ఐసిని కాపాడుతూ, ఏజెంట్ల హక్కుల కోసం పోరాడుతోందని తెలిపారు. రూ.32 లక్షల కోట్లు కలిగిన ఎల్‌ఐసిని బలహీనపరిచేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందన్నారు. ఐపిఒ పేరుతో కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఐపిఒ నుంచి ఎల్‌ఐసిని రక్షించుకునేందుకు ఈ మహాసభలో చర్చిస్తామన్నారు. ఈ మహాసభ దేశవ్యాప్తంగా 12 లక్షల మంది ఏజెంట్లుకు ప్రాతినిథ్యం వహిస్తూ.. 600 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా భవిష్యత్తు పోరాటాలను ఈ మహాసభలో రూపొందిస్తామన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాటం స్ఫూర్తితో ఎల్‌ఐసి రక్షణ కోసం పోరాటం జరగనుందని చెప్పారు. మహాసభ జయప్రదానికి విశాఖ కార్మిక వర్గం, ప్రజానీకం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించాల నికోరారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసి ఎఒఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎల్.మంజునాథ్, జోనల్ ప్రధాన కార్యదర్శి పిఎల్.నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షులు టి.కోటేశ్వరరావు, విశాఖ డివిజన్ కార్యదర్శి ఠాగూర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ పాల్గొన్నారు.
- ఆహ్వాన సంఘం ఏర్పాటు
మహాసభ నిర్వహణకు వంద మందితో ఆహ్వాన సంఘానిు ఏర్పాటు చేశారు. ప్యాట్రన్స్‌గా ఎల్‌ఐసి ఎఒఐ జాతీయ అధ్యక్షులు బాసుదేబ్ ఆచార్య, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా మాజీ ఎంపి ఎ.సంపత్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పిజి.దిలీప్, చైర్మన్‌గా సిఐటియు ఎపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు ఉంటారు. వైస్ చైర్మన్లుగా మంజునాథ్, ఎం.సూర్యారావు, వేణు, నాగరాజు, పోలయ్య, జనరల్ కన్వీనర్‌గా పిఎల్.నర్సింగరావు, కన్వీనర్‌గా ఆర్‌కెఎస్‌వి.కుమార్, కోశాధికారిగా ఠాగూర్, తదితరులు ఈ కమిటీలో ఉన్నారు.










