- గతేడాదే 101 సార్లు
- బాగా దెబ్బతిన్న కాశ్మీర్
న్యూఢిల్లీ : గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా ఇంటర్‌నెట్ షట్‌డౌన్‌ల సంఖ్య విపరీతంగా 690కి పెరిగింది. వీటిలో గతేడాదిలోనే 101 సార్లు మూతపడ్డాయి. ఇప్పటివరకు ఈ ఏడాది 75 సార్లు షట్‌డౌన్లు విధించినట్లు సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ (ఎస్‌ఎఫ్‌ఎల్‌సి) తెలిపింది. దాతల విరాళాలతో కొనసాగే న్యాయపరమైన సేవల సంస్థ అయిన ఎస్‌ఎఫ్‌ఎల్‌సిలో లాయర్లు, విధాన విశ్లేషకులు, సాంకేతిక నిపుణులు, విద్యార్థులు ఉంటారు. డిజిటల్ ప్రపంచ స్వేచ్ఛను కాపాడేందుకు ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ''లెట్ ది నెట్‌వర్క్ : ఇంటర్‌నెట్ షట్‌డౌన్స్ ఇన్ ఇండియా 2022'' పేరుతో ఎస్‌ఎఫ్‌ఎల్‌ఇసి ఒక నివేదిక వెలువరించింది. పరీక్షల్లో మోసానికి పాల్పడకుండా నివారించడం నుంచి మతోన్మాద ఉద్రిక్తతలు, తీవ్రవాదం వరకుపలు కారణాలను పేర్కొంటూ ఈ ఏడాది 75సార్లు ఇంటర్‌నెట్‌ను షట్ డౌన్ చేసినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇలా ఇంటర్‌నెట్ షట్‌డౌన్‌లు జరగడం వల్ల కలిగే ప్రభావానిు మానవ హక్కులు, ఆర్థిక కోణం నుంచి విశ్లేషించింది. వీటివల్ల విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి మౌలిక నిత్యావసర సేవలు ఎలా దెబ్బతింటాయో పేర్కొంది. ఇందుకోసం ఇంటర్‌నెట్ షట్‌డౌన్ ట్రాకర్ (ఐఎస్‌టి)ని ఉపయోగించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక, సామాజిక మండలితో ప్రత్యేక సంప్రదింపుల హోదాను ఎస్‌ఎఫ్‌ఎల్‌ఇ డాట్ ఇన్ పొందింది. 2012 నుండి ప్రతిసారి ఇంటర్‌నెట్‌ను షట్‌డౌన్ చేసిన సందర్భాన్ని ఐఎస్‌టి గుర్తించింది. జనవరి 26న జమ్ము కాశ్మీర్‌లో తొలిసారిగా షట్‌డౌన్ విధించారనిపేర్కొంది. మొత్తంగా అనిు సమయాల్లో 18మాసాలకుపైన కాశ్మీర్‌లో ఇంటర్‌నెట్ మూతపడింది. దీనివల్ల ఆర్థికంగా బాగా నష్టం వాటిల్లింది. కొన్ని కేసుల్లో కీలకమైన పరీక్షలను విద్యార్థులు రాయలేకపోయారు. కరోనా సమయంలో ఆన్‌లైన్ తరగతులే దిక్కవడంతో ఇంటర్‌నెట్‌ను షట్‌డౌన్ చేయడం వల్ల తీవ్రంగా దెబ్బతినుది విద్యా రంగమే కావడం గమనార్హం.










