ముంబయి: మహిళల ప్రిమియర్ లీగ్, ఇండియన్ ప్రిమియర్ లీగ్ మీడియా హక్కులు దక్కించుకున్న వైకోమ్-18 తాజాగా భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) డిజిటల్, టివి హక్కులను సొంతం చేసుకుంది. గురువారం జరిగిన వేలంలో డిస్నీ స్టార్, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా పోటీదారులను వెనక్కి నెట్టి వైకోమ్-18 చాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. మొత్తం రూ.5,963 కోట్లకు ఈ హక్కులను దక్కించుకున్నట్లు బిసిసిఐ తెలిపింది. స్వదేశంలో 2023-28 సీజన్‌లో జరిగే అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం వయాకామ్‌కు వచ్చింది. టివి ప్రసారాలు స్పోర్ట్స్-18లోనూ, జియో సినిమా ప్లాట్‌ఫామ్‌లో లైవ్‌స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 2023 నుంచి మార్చి 2028 వరకు అంతర్జాతీయంగా 88 ద్వైపాక్షిక మ్యాచ్‌లు ప్రసారం చేసే హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది. ఇందులో 25టెస్టులు, 27వన్డేలు, 36అంతర్జాతీయ టి20లు ఉన్నాయి. ఈ-వేలంలో వయాకామ్‌కు సోనీ పిక్చర్స్, డిస్నీ స్టార్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది.










