Feb 07,2023 20:42

హైదరాబాద్‌ : భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో సామ్‌సంగ్‌ 65 శాతం మార్కెట్‌ వాటాతో ఆధిపత్యాన్ని కలిగి ఉందని సామ్‌సంగ్‌ ఇండియా మొబైల్‌ బిజినెస్‌ జనరల్‌ మేనేజర్‌ అక్షరు గుప్తా అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌23 సీరిస్‌ ఫోన్లను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గత వారం గ్లోబల్‌ మార్కెట్‌లో ఆవిష్కరించిన ఈ ఫోన్‌కు భారత్‌లో 24 గంటల్లోనే 1.40 లక్షల ప్రీ బుకింగ్‌లు వచ్చాయన్నారు. రూ.1 లక్ష పైబడిన ఫోన్ల ప్రీమియం కేటగిరీలో సామ్‌సంగ్‌కు 65 శాతం మార్కెట్‌ వాటా ఉందన్నారు. ఈ కేటగిరిలో పరిశ్రమ 35 శాతం వృద్థిని నమోదు చేస్తే.. సామ్‌సంగ్‌ 70 శాతం పెరుగుదలను సాధిస్తుందన్నారు. ఈ ఏడాది రెండంకెల వృద్థిని నమోదు చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్‌23 సీరిస్‌లో ఏడు వేరియంట్లను ఆవిష్కరించగా.. వీటి ధరల శ్రేణీ రూ.74,999 నుంచి రూ.1,54,999గా ఉంది. వీటిపై వడ్డీ లేని ఇఎంఐ సౌలభ్యాన్ని కల్పిస్తున్నామని అక్షరు గుప్తా తెలిపారు.