ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఐదు ప్రాణాంతక బ్యాక్టీరియాల వల్ల 2019లో 6.8 లక్షల మరణాలు దేశంలో సంభవించాయని లాన్సెట్ అధ్యయనం స్పష్టం చేసింది. ఎస్చెరిచియా కోలి, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, క్లెబ్సియెల్లా న్యుమోనియా, స్టెఫిలోకాకస్ ఆరియస్, అసినెటోబాక్టర్ బామానీల వల్లే ఈ మరణాలు సంభవించాయి. ఇ.కోలి వల్ల దేశంలో 1.6 లక్షల మంది మరణించగా, ప్రపంచవ్యాప్తంగానూ ఎక్కువ మరణాలకు ఈ ఇన్ఫెక్షన్ ప్రధాన కారణమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 77 లక్షల మరణాలకు 11 ఇన్ఫెక్షియస్ సిండ్రోమ్లలోని 33 బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు (రెసిస్టెంట్, యాంటీమైక్రోబయాల్స్కు గురయ్యేవి రెండూ) కారణమని తెలిపింది. ఈ పరిశోధనలో 11,361 ప్రాంతాల్లో 343 మిలియన్ల ప్రజల డేటాను సేకరించామని తెలిపింది. ఈ అధ్యయనంలో అంచనా వేసిన 11 ఇన్ఫెక్షియస్ సిండ్రోమ్లలో 2019లో ఇన్ఫెక్షన్ సంబంధిత మరణాలు 13.7 మిలియన్లు ఉండగా, అందులో 7.7 మిలియన్ల మరణాలు 33 బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంభవించినట్లు తెలిపింది. ఎస్చెరిచియా కోలి, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, క్లెబ్సియెల్లా న్యుమోనియా, స్టెఫిలోకాకస్ ఆరియస్, సూడోమోనాస్ ఎరుగినోసా అనే ఐదు ప్రధాన వ్యాధి కారక బ్యాక్టీరియాల వల్ల 54.9 శాతం మరణాలు సంభవించాయి. సబ్-సహారా ఆఫ్రికా సూపర్-రీజియన్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో అత్యధిక వయస్సు మరణాల రేటు (ప్రతి 1,00,000 మందికి 230 మరణాలు) ఉంది. ఎస్.ఆరియస్ బ్యాక్టీరియా ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల్లో 15 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో మరణాలకు ప్రధాన కారణంగా ఉంది. ఎస్. న్యుమోనియా బ్యాక్టీరియా ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలలో అత్యధిక మరణాలకు కారణంగా ఉంది.










