Feb 07,2021 20:17

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటివరకూ 57,75,322 మంది ఆరోగ్య, ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు కరోనా వ్యాక్సిన్‌ వేశారు. ప్రపంచంలో ఎక్కువమందికి కరోనా వ్యాక్సిన్‌ వేసిన దేశాల్లో అమెరికా, బ్రిటన్‌ తరువాత మూడో స్థానంలో భారత్‌ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా 53,04,546 మంది వైద్య సిబ్బంది, 4,70,776 మంది ఫ్రంట్‌లైన్‌ కార్మికులకు టీకా వేసినట్టు తెలిపింది. అత్యధికంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో 6,73,542 మంది, ఆ తర్వాత మహారాష్ట్రలో 4,73,480 మంది, రాజస్థాన్‌లో 4,59,652 మందికి కరోనా టీకాలు వేసినట్టు తెలిపింది. ఒక్కో రాష్ట్రంలో రెండేసి లక్షల మంది చొప్పున 12 రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు తీసుకున్నట్టు పేర్కొంది. వ్యాక్సినేషన్‌ శాతాన్ని పెంచాల్సిందిగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైంది. అప్పుడు తొలి డోసు తీసుకున్న వారు ఈ నెల 13న రెండో డోసు తీసుకోనున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి అభివఅద్ధి చెందాలంటే 28 రోజుల వ్యవధిలో రెండో డోసు తీసుకోవడం తప్పనిసరి.

12 వేలకు పైగా కొత్త కేసులు
దేశంలో గత 24 గంటల్లో 6,95,789 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 12,059 కొత్త కేసులు, 78 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 1,08,26,363కి, మరణాల సంఖ్య 1,54,996కి చేరింది. గత 24 గంటల్లో 11,805 మంది వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,05,22,601కు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,48,766గా ఉంది. మరణాల రేటు 1.43 శాతంగా ఉంది.