ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో అవినీతికి సంబంధించి ప్రజా ఫిర్యాదుల సంఖ్య గణనీయం గా ఉందని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సిపిగ్రామ్స్) ఆన్‌లైన్ పోర్టల్‌లో అవినీతికి సంబంధించి ఏకంగా 46,627 ఫిర్యాదులు అందినట్లు ఆగస్టు-2022 నివేదిక వెల్లడించింది. అత్యధికంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డిఎఫ్‌ఎస్) పరిధిలోని బ్యాంకింగ్ విభాగంపై 14,934, బీమా విభాగంపై 3,306 ఫిర్యాదులు వచ్చినట్లు నివేదిక తెలిపింది. సిబ్బంది, శిక్షణ విభాగం (డిఒపిటి)పై అవినీతి 2,223 ఫిర్యాదులు వచ్చాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంపై 1,831, కాగ్ కార్యాలయంపై 1,784, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖపై 1,005 ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25 వరకు సిపిగ్రామ్స్ ద్వారా మొత్తం 7,50,822 ప్రజా ఫిర్యాదులు స్వీకరించగా, వీటిలో 7,27,673 పరిష్కరించగా, 91,677 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.










