ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో మహిళలపై 4,340 అత్యాచారాలు జరిగాయని కేంద్ర హోం సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రా తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018తో పోల్చితే 2021 నాటికి అత్యాచారాలు 22 శాతం, మహిళలపై దాడులు 15 శాతం, ఆత్మగౌరవానికి భంగం కలిగించిన కేసులు 31 శాతం పెరిగాయని తెలిపారు. 2018 నుంచి 2021 మధ్య మహిళలపై 4,340 అత్యాచారాలు, 8,406 ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఉదంతాలు, 18,883 సాధారణ దాడులు జరిగాయని తెలిపారు. తెలంగాణలో మహిళలపై 2,193 అత్యాచారాల ఘటనలు చోటు చేసుకున్నాయని, మహిళలపై దాడులకు సంబంధించి 18,029 కేసులు, 2,913 ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఉదంతాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నాలుగేళ్లలో మహిళలపై అత్యాచారాలకు సంబంధించి 1,25,111 ఘటనలు చోటు చేసుకున్నాయని, మహిళలపై దాడులకు సంబంధించి 3,51,948 కేసులు నమోదయ్యాయని, 28,782 ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఉదంతాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఏపిలో మహిళలు, బాలికలపై నాలుగేళ్లలో 12 యాసిడ్ దాడులు జరిగాయని, 51 గ్యాంగ్ రేపులు జరిగాయని, 1,335 మంది మహిళలు హత్యకు గురయ్యారని చెప్పారు. తెలంగాణలో 14 యాసిడ్ దాడులు, 63 గ్యాంగ్ రేపులు జరిగాయని, 1,021 మంది మహిళలు హత్యకు గురయ్యారని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళలు, బాలికలపై నాలుగేళ్లలో 488 యాసిడ్ దాడులు, 7,921 గ్యాంగ్ రేపులు, 33,620 మంది మహిళలు హత్యకు గురయ్యారని తెలిపారు.
మూడేళ్లలో తొమ్మిదిళ్లే పూర్తి
గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదిళ్లే పూర్తయ్యాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్వోతి తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019-20 నుంచి 2021-22 వరకు మూడేళ్లలో పిఎంఎవై-జి కింద 1,19,690 ఇళ్లు మంజూరయ్యాయని, తొమ్మిదిళ్లే పూర్తయ్యాయని తెలిపారు. తెలంగాణ, పుదుచ్చేరిల్లో ఈ పథకం అమలు కావటం లేదని అన్నారు.
గత నాలుగేళ్లలో ఏపి రోజువారీ కూలీలు 9,192 మంది ఆత్మహత్య
ఏపిలో గత నాలుగేళ్లలో 9,192 మంది రోజువారీ కూలీలు ఆత్మహత్యకు పాల్పడ్డారని కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద రారు తెలిపారు. తెలంగాణలో 13,817 మంది రోజువారీ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,42,360 రోజువారీ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు.
నాలుగేళ్లలో ఏపిలో దళితులపై 7,871 దాడులు
గత నాలుగేళ్లలో ఏపిలో దళితులపై 7,871 దాడులు జరిగినట్లు కేంద్ర హోం సహాయ మంత్రి నిత్యానంద రారు తెలిపారు. తెలంగాణలో నాలుగేళ్లలో 6,928 దళితులపై దాడులు జరిగాయని తెలిపారు. దేశవ్యాప్తంగా దళితులపై 1,89,569 దాడులు జరిగాయని అన్నారు.
ఏపిలో ఏడాదిలో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు 22,42,769 తగ్గుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు 22,42,769 తగ్గారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
నరసరావుపేటలో గ్రామీణ ఆరోగ్య శిక్షణా కేంద్రం పెట్టాలనే అభ్యర్థన అందలేదు
నరసరావుపేటలో గ్రామీణ ఆరోగ్య శిక్షణా కేంద్రం, మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనే అభ్యర్థన తమకు అందలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవర్ తెలిపారు. వైసిపి ఎంపి పరిమల్ నత్వానీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరిలో మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ ఒకటి స్థాపించబడిందని తెలిపారు.










