Sep 16,2022 08:06

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : తొలిరోజు శాసనసభలో సవరణతో కూడిన నాలుగు బిల్లులను ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌-1994 చట్టం సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రవేశపెట్టగా, ఆంధ్రప్రదేశ్‌ రహదారి అభివృద్ధి కార్పొరేషన్‌-1998 చట్టం సవరణ బిల్లును మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీసుల-1960 చట్టం సవరణ బిల్లుతోపాటు ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లు-1966 చట్టం సవరణ బిల్లును మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి ప్రవేశపెట్టారు.
    పరిపాలన సంస్కరణల కొనసాగింపులో భాగంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను రాష్ట్రంలో పునర్‌ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. అయితే,2021లో ఏర్పాటైన పంచాయతీరాజ్‌ సంస్థలు ఐదేళ్ల వరకు ఉంటాయి. దీంతో కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లలో పంచాయతీ సంస్థలపై సందిగ్థత నెలకొంది. తాజా సవరణ బిల్లులో పంచాయతీల ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యే వరకు యధాతథ స్థితి కొనసాగుతుందని పేర్కొన్నారు.
   ఆంధ్రప్రదేశ్‌ రహదారి అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎపిఆర్‌డిసి) అభివృద్ధితోపాటు కార్పొరేషన్‌ నైపుణ్యతను మెరుగు పరచేందుకు, మరింత జవాబుదారీతనాన్ని కలిగించేందుకు ప్రస్తుతమున్న ఇద్దరు సభ్యులకు బదులుగా 16 మందిని నామినేట్‌ చేసేందుకు గాను రహదారి అభివృద్థి కార్పొరేషన్‌ చట్టం సవరణ బిల్లును ప్రతిపాదించారు. వీరి పదవీ కాలాన్ని రెండేళ్ల వరకు కాలపరిమితికి నిర్ణయించారు.
    ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, ఆరోపణలను విచారించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీసుల (క్రమ శిక్షణ కార్య వ్యవహారాల ట్రిబ్యునల్‌) చట్టం-1960, 3వ నిబంధన కింద క్రమశిక్షణ కార్య వ్యవహారాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు గతంలో చేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఇది హైదరాబాద్‌లోనే కొనసాగుతోంది. దీనికి ఛైర్మన్‌ కానీ సభ్యులు నియామకాలు చేపట్టలేదు. అందువల్ల వందల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వీటి పరిష్కార ప్రొసీడింగ్స్‌ను విచారణల కమిషనరేట్‌కు బదిలీ చేయడంతోపాటు ట్రిబ్యునల్‌ను రద్దుకు వీలు కల్పిస్తూ సివిల్‌ సర్వీసు చట్టానికి సవరణ ప్రతిపాదించారు.
   . కేంద్ర మార్కెట్‌ నిధికి వాటా విరాళంలో పరిమితి ఉంది. అభివృద్ధి పనుల కోసం అనేక వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు తగినన్ని నిధులు లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ (వ్యవసాయ ఉత్పత్తి, జీవధన) మార్కెట్ల 1966 చట్టంలోని 16వ నిబంధనను సవరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల కేంద్ర మార్కెట్‌ నిధి (సిఎంఎఫ్‌) నివినియోగించుకునేందుకు వీలుగా ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు.