Aug 15,2023 17:28

మాస్కో :    రష్యా గ్యాస్‌ స్టేషన్‌ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 35కి చేరింది. అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం.. ఈ ప్రమాదంలో 35 మంది మరణించగా, 80 మంది గాయపడ్డారు. రష్యా దక్షిణ ప్రాంతంలోని డగెస్తాన్‌లోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు జరిగిన సంగతి తెలిసిందే.   రష్యా కాలమానం ప్రకారం... సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో పలు కార్లు కాలి బూడిదయ్యాయి. ఓ భారీ అంతస్థుల భవనం దగ్ధమైనట్లు సమాచారం.

డగెస్తాన్‌లో జరిగిన దుర్ఘటనలో బాధితుల కుటుంబాలు మరియు స్నేహితులకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రగాఢ సానుభూతి ప్రకటించినట్లు క్రెమ్లిన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు తెలిపింది.

కాస్పియన్‌ సముద్రం ఒడ్డున ఉన్న మఖచ్కల నగరంలో హైవే పక్కన ఉన్న ఓ కార్ల సర్వీసింగ్‌ సెంటర్‌లో ముందుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న గ్యాస్‌ స్టేషన్‌కు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పరిసర ప్రాంతాలకు కూడా వ్యాపించాయని అన్నారు. అగ్నిమాపక సిబ్బంది 260 ఫైరింజన్లతో మూడున్నర గంటలకు పైగా శ్రమపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మంటల ధాటికి కార్లు ఎగిరిపడుతుండగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న ఫొటోలు మీడియాలో వైరల్‌గా మారాయి.