న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) రాక 34 శాతం క్షీణించాయి. కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలికాం, ఆటో, ఫార్మా రంగాల పెట్టుబడుల్లో పతనం చోటు చేసుకుందని ప్రభుత్వ గణంకాలు వెల్లడించాయి. గడిచిన జూన్ త్రైమాసికంలో భారత్‌లోకి 10.94 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐలు వచ్చాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 16.58 బిలియన్ డాలర్ల పెట్టుబడులు నమోదయ్యాయి. అదే విధంగా 2023 జనవరి నుండి మార్చి మధ్య కాలంలో ఎఫ్‌డిఐ ప్రవాహంలో 40.55 శాతం తగ్గి 9.28 బిలియన్ డాలర్లకు పతనమయ్యాయి. గడిచిన ఏప్రిల్‌లో 5.1 బిలియన్లు, మేలో 2.67 బిలియన్లు, జూన్‌లో 3.16 బిలియన్ల చొప్పున ఎఫ్‌డిఐలు వచ్చాయి. గతేడాది ఇదే మాసాల్లో వరుసగా 6.46 బిలియన్లు, 6.15 బిలియన్లు, 3.98 బిలియన్ల చొప్పున పెట్టుబడులు నమోదయ్యాయి. గడిచిన త్రైమాసికంలో సింగపూర్, యుఎస్, యుకె, యుఎఇ, మారిషస్ వంటి ప్రముఖ దేశాల నుండి ఎఫ్‌డిఐ ఈక్విటీ రాబడుల్లో తగ్గుదల చోటు చేసుకుంది.










