
వన్డే ప్రపంచ కప్ ప్రైజ్ మనీ ఇదే: ఐసిసి
దుబాయ్: ఐసిసి వన్డే ప్రపంచకప్ టైటిల్ విజేతకు రూ.39కోట్ల ప్రైజ్‌మనీని అందజేయనున్నారు. ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు మొత్తం 10లక్షల డాలర్లను కేటాయించినట్టు ఐసిసి శుక్రవారం ప్రకటించింది. ట్రోఫీ విజేతకు రూ. 33 కోట్లు(4 లక్షల డాలర్లు), రన్నరప్ జట్టుకు రూ. 16.5 కోట్లు(2 లక్షల డాలర్లు) దక్కనున్నాయి. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లు రూ.13 కోట్లు అందజేయనున్నట్లు ఐసిసి తెలిపింది. 5, 6 స్థానాల్లో నిలిచిన ఒక్కో జట్టుకు రూ.4.9 కోట్లు ఇవ్వనున్నారు. అంతేకాదు గ్రూప్ దశలో గెలిచిన జట్లకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. గ్రూప్ స్టేజ్‌లో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు రూ.33 లక్షలు లభిస్తాయని ఐసిసి వెల్లడించింది. ఇక 2019లో చాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు రూ.39 కోట్లు ప్రైజ్‌మనీగా దక్కాయి. దానితో పోల్చిచూస్తే ఈసారి విజేతగా నిలిచిన జట్టు రూ.6కోట్లు తక్కువ మొత్తాన్ని అందుకోనుంది. రౌండ్ రాబిన్ పద్దతిలో 10జట్లు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్ పోరుకు అర్హత సాధిస్తాయి. ఈసారి ఫైనల్‌తో పాటు సెమీఫైనల్ మ్యాచ్‌లకు కూడా రిజర్వ్ డే కేటాయించారు.
- శ్రీలంకలో అండర్19 ప్రపంచకప్..
అండర్-19 పురుషుల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసిసి విడుదల చేసింది. 15వ ప్రపంచ కప్ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నట్లు ఐసిసి వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 13న టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 23 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ ఫిబ్రవరి 4న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఆసియా కప్ జరిగిన లంక గడ్డపై నెలల వ్యవధిలో అండర్-19 వరల్డ్ కప్ మొదలవ్వనుంది. శ్రీలంక 18ఏళ్ల తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం 16 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఫైనల్‌తో కలిపి 41మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 6కు అర్హత సాధిస్తాయి. వీటి మధ్యే సెమీస్ ఫైట్ ఉంటుంది. ఈ టోర్నీలో భారత జట్టు జనవరి 14న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకలోని ఐదు ప్రధాన స్టేడియాల్లో అండర్-19 వరల్డ్ కప్ జరుగనుంది.
- గ్రూప్‌లు..
గ్రూప్ ఏ : భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా.
గ్రూప్ బి : ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్.
గ్రూప్ సి : ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, నమీబియా.
గ్రూప్ డి : ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, నేపాల్.