- మార్టూరులో గోడపత్రిక ఆవిష్కరణ
ప్రజాశక్తి - మార్టూరు రూరల్ (బాపట్ల) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 30 నుండి సెప్టెంబర్ 4 వరకు జరిగే నిరసనల్లో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం బాపట్ల జిల్లా నాయకులు సిహెచ్ మజుందార్ పిలుపునిచ్చారు. సోమవారం మార్టూరులో జిల్లా నాయకులు బత్తుల హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో సమరభేరి క్యాంపైన్ పోస్టర్‌ను మజుందార్ ఆవిష్కరించారు. అనంతరం అయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, ట్రూ అప్ చార్జీలు పేరుతో కరెంటు చార్జీలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజానీకం నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చాక ఎన్నడూ లేని విదంగా గ్యాస్ సిలెండర్ ధర ఆరు సార్లు పెరిగి రూ.1200కు చేరిందని మండిపడ్డారు. బిజెపి పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలే తమ ప్రభుత్వ పెద్దల నిర్ణయాలను వ్యతిరేకిస్తుంటే రాష్ట్రం లోని వైసిపి ప్రభుత్వం సమస్యల పరిష్కారం పట్ల శ్రద్ద చూపడం లేదని విమర్శించారు. లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి ప్రాధమిక చట్టాలను నిర్వీర్యం చేశారన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అయన విమర్శించారు. ఉపాధి లేక నిరుద్యోగులు,అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మజుందార్ మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1 న గ్రామ సచివాలయ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని ప్రతి ఇంటికి కరపత్రం పంచాలని, సెప్టెంబర్ 4 న మండల కార్యాలయాల వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మజుందార్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కందిమళ్ల రామ కోటేశ్వరరావు, సిపిఎం నాయకులు ఎనికపాటి రాంబాబు, గఫూర్, నాగరాజు, బొడెంపుడి సూరిబాబు పాల్గొన్నారు.










