Nov 07,2023 21:01

మధ్యంతర డివిడెండ్‌ 125 శాతం
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఇండియన్‌ రైల్వే కాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సిటిసి) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. గడిచిన క్యూ2లో 30.36 శాతం వృద్థితో రూ.294.67 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.226 కోట్ల లాభాలు నమోదు చేసింది. అధిక కాటరింగ్‌ అమ్మకాలు, టికెట్ల విక్రయాలు సంస్థ రెవెన్యూ, లాభాలను పెంచాయి. గడిచిన క్యూ2లో ఐఆర్‌సిటిసి రెవెన్యూ 23.91 శాతం వృద్థితో 995.31 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.805.80 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. 2023ా24కు గాను ప్రతీ రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై మధ్యంతర డివిడెండ్‌ కింద రూ.2.50 శాతం లేదా 125 శాతం చెల్లించడానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.160 కోట్లు వ్యయం కానుంది. ఈ మొత్తాన్ని నవంబర్‌ 17న వాటాదారులకు పంపించనుంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఇలో ఐఆర్‌సిటిసి షేర్లు 1.68 శాతం పెరిగి రూ.682.75 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 6.29 శాతం లాభపడింది.

జెబి ఫార్మాకు రూ.150 కోట్ల లాభాలు
జెబి కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ 2023ా24 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 35 శాతం వృద్థితో రూ.150.5 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.111.1 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.809 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. క్రితం క్యూ2లో 8.9 శాతం పెరిగి రూ.881.7 కోట్లకు చేరింది. మంగళవారం బిఎస్‌ఇలో జెబి ఫార్మా షేర్‌ 3.05 శాతం పెరిగి రూ.1,454 వద్ద ముగిసింది.