- కోర్టు కేసుల్లో లక్షమంది పేదల పట్టాల భూములు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 30.30లక్షల మంది అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఆచరణలో సుమారు 25లక్షల మందికి పైగా ఇంటి పట్టాలు రెవెన్యూ యంత్రాంగం పంపిణీ చేసింది. మరో 1,01,580 మందికి సంబందించిన పట్టాలు మంజూరు చేసిన స్థలాలకు సంబందించి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మరో 50 వేల మంది లబ్దిదారులు తమకు కేటాయించిన స్ధలాలు శ్మశానాలు, మునక ప్రాంతాల్లో ఉన్నాయని, వాటికి ప్రత్నామ్నాయ స్ధలాలు కేటాయించాలని సిఎం దృష్టికి ఇటీవల తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వారందరికీ నివాసయోగ్యమైన ప్రాంతాల్లో కేటాయించాలని సిఎం రెవెన్యూ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే విజయవాడ, గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పేదలకు రాజధాని ప్రాంతంలో ఇంటి స్ధలాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ అంశం కూడా కోర్టు పరిధిలో ఉండటంతో అర్హులకు ఇతర ప్రాంతాల్లో స్ధలాలు కేటాయించక పోవడంతో ఆయా లబ్ధిదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది లబ్ధిదారులకు నేటికీ ఇంటి స్థలాలు మంజూరు కాలేదు. తక్షణమే స్ధలాలు కేటాయించని వారి భూములను అన్వేషించాలని ఇటీవల సిఎం రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇది ఇలా ఉంటే నివేశన స్థలాలు కేటాయించిన వారిలో 17,929 మంది ఇళ్లు కట్టుకునేందుకు అయిష్టత వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించేందుకు భూసేకరణ చేయడం క్షేత్రస్దాయి రెవెన్యూ అధికారులకు కత్తిమీద సాములాగా మారింది.
లే అవుట్లు సిద్ధం కానివి 4650
వివిధ కారణాలు చూపుతూ రాష్ట్ర వ్యాప్తంగా లే అవుట్లు సిద్దం చేయాల్సినవి నేటికీ 4650 వరకు ఉన్నట్లు రెవెన్యూశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ఎన్‌టిఆర్ జిల్లాలో 2792, పల్నాడులో 22, బాపట్లలో 36, ప్రకాశంలో 956 లే అవుట్లు ఉన్నాయి.











