
ముంబయి: మహిళల ప్రిమియర్‌లీగ్(డబ్ల్యుపిఎల్) రెండో సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రెండో సీజన్‌కు సంబంధించి ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను బిసిసిఐ గురువారం విడుదల చేసింది. ఐదు ఫ్రాంచైజీలు కలిపి 60మంది ఆటగాళ్లను అట్టి పెట్టుకోగా.. 29మంది ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాయి. అత్యధిక మందిని విడుదలచేసిన జట్టుగా గుజరాత్ జెయింట్స్ నిలిచింది. ఆ జట్టు ఏకంగా 11 మందిని వదులుకుంది. తొలి సీజన్ విజేత ముంబయి ఇండియన్స్ నలుగురిని, ఢిల్లీ క్యాపిటల్స్ ముగ్గురు ఆటగాళ్లను విడుదల చేసింది. ఫ్రాంచైజీలు నిలుపుకున్న 60మంది ఆటగాళ్లలో 21మంది విదేశీ ప్లేయర్లు ఉండగా.. 39మంది భారత ప్లేయర్లు ఉన్నారు. ఆర్సీబీ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డేన్ వాన్ నీ కార్క్‌ను, గుజరాత్ సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ, సుష్మా వర్మ వంటి స్టార్ ఆటగాళ్లను రిలీవ్ చేసింది. కీలక ప్లేయర్లు అయిన స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లను ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్ అంటిపెట్టుకున్నాయి.