న్యూఢిల్లీ : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కేబినెట్‌లోకి 24 మంది ఎమ్మెల్యేలను తీసుకోనున్నారు. వీరంతా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధిష్టానం, సిఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డికె. శివకుమార్‌ల మధ్య జరిగిన సమావేశంలో మంత్రుల పేర్లను ఖరారు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. తుది జాబితాపై సంతకం కోసం సిద్ధరామయ్య శుక్రవారం రాహుల్‌తో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు వారికి మంత్రిత్వ శాఖల కేటాయింపు జరగలేదు. రాష్ట్రంలోని పలు వర్గాల మధ్య సయోధ్య కుదిరేలా మంత్రి జాబితాను రూపొందించడం, మంత్రిత్వ శాఖల కేటాయింపు కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సామేనని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో అత్యంత కీలకమైన వర్గమైన లింగాయత్‌లు కాంగ్రెస్ గెలుపునకు పెద్ద పీట వేసినట్లు పేర్కొంటూ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కీలకమైన మంత్రి పదవులు దక్కుతాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన వాగ్దాలన్నింటినీ నెరవేర్చాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ నెల 20న సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె.శివకుమార్ డిప్యూటీ సిఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.