
ఖమ్మం: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన గర్భిణీల అవస్థలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గిరిజన గూడెంలకు రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో అంబులెన్స్ వారి గ్రామానికి చేరుకోలేక పోవడంతో పురుటినొప్పులు మొదలైన ఓ గర్భిణిని 'డోలి'లో అటవీ ప్రాంతం గుండా ఆసుపత్రికి తీసుకెళ్లిన షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. దాదాపు 20 కిలోమీటర్ల మేర వరకు ఆమెను భుజాలపై ఎక్కించుకుని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మహిళను ఆరోగ్య కేంద్రం నుంచి అంబులెన్స్‌లో భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని అధికారులు తెలిపారు. రోడ్డు లేకపోయినా కుటుంబ సభ్యులు డోలీలో ఎత్తుకెళ్లడం హర్షించదగ్గ విషయం అని స్థానికులు పేర్కొంటున్నారు.