లండన్ : నెదర్లాండ్స్ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన భారీ నౌకలో గాయపడిన 20 మంది నౌక సిబ్బంది క్షేమంగా భారత్‌కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. జులై 25న జరిగిన ఈ ఘటనలో నౌక సిబ్బందిలో ఒకరు మరణించగా, 20 మంది తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. గాయపడిన 20 మంది నౌక సిబ్బంది గతవారం భారత్‌కు చేరుకున్నారని హేగ్‌లోని భారత రాయబార కార్యాలయం ట్విటర్‌లో పేర్కొంది. కష్ట సమయంలో భారత సిబ్బందికి సహాయం అందించిన డచ్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కూడా భారత్‌కు తిరిగి పంపినట్లు వెల్లడించారు.
పనామా- ఫ్రీ మాంటల్ హైవే పేరు మీద రిజిస్టరైన ఈ భారీ కార్గో నౌకలో 3,800 వాహనాలను తరలిస్తున్నారు. జర్మనీ నుండి ఈజిప్టు వెళుతున్న ఈ నౌక జులై 25న నెదర్లాండ్స్‌లోని అమెలాండ్‌కు ఉత్తరాన 27 కి.మీ దూరంలోని ఉత్తర సముద్రంలో డచ్ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ నౌకలో మొత్తం 23 సిబ్బంది ఉన్నారు.










