Oct 18,2023 21:23

వాషింగ్టన్‌ : ప్రస్తుత ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 2,40,000 మంది టెకీలపై వేటు పడిందని లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ వెల్లడించింది. వీరిని 1,059 టెక్నాలజీ కంపెనీలు తొలగించాయని పేర్కొంది. గతేడాది 1024 కంపెనీలు మొత్తంగా 1,54,336 మందిని ఇంటికి పంపించాయని తెలిపింది. వచ్చే డిసెంబర్‌ ముగింపు కల్లా తమ ఉద్యోగుల్లో 2.5 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు క్వాల్‌కమ్‌ ఈ వారంలో ప్రకటించిన విషయం తెలిసిందే. సిస్కో సిస్టమ్స్‌, రోకు, మైక్రోసాఫ్ట్‌, పోకెమాన్‌ గో తదితర సంస్థలు ఉద్యోగులను తొలగించిన వాటిలో ఉన్నాయని తెలిపింది. గడిచిన రెండేళ్లలో ప్రతి గంటకూ 23 మంది టెకీలు కొలువులు కోల్పోయరని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 2120 టెక్‌ కంపెనీలు దాదాపు 4 లక్షల మంది టెకీలను సాగనంపాయని లేఆఫ్‌.ఎఫ్‌వైఐ డేటా తెలిపింది.