నెలకు సగటున రూ.1.51 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : ప్రజలకు కల్పించే సౌకర్యాలు ఎలా ఉన్నప్పటికీ.. దేశంలో పన్ను వసూళ్లు రాకేట్‌లా దూసుకెళ్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022ా23)లో 22 శాతం వృద్థితో రూ.18 లక్షల కోట్ల వస్తు సేవల పన్నులు (జిఎస్‌టి) వసూళ్లయ్యాయని శనివారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతీ నెల సగటున రూ.1.51 లక్ష కోట్ల చొప్పున వసూళ్లయ్యాయి. '' 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో నెలకు సగటున రూ.1.55 లక్షల కోట్లు, ఇంతక్రితం డిసెంబర్ త్రైమాసికంలో నెలకు రూ.1.51 లక్షల కోట్లు, తొలి, ద్వితీయ త్రైమాసికాల్లో నెలకు సగటున వరుసగా రూ.1.46 లక్షల కోట్లు, రూ.1.49 లక్షల కోట్లు చొప్పున వసూళ్లు జరిగాయి.'' అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గడిచిన మార్చి నెలలో జిఎస్‌టి వసూళ్లు 13 శాతం పెరిగి రూ.1.60,122 కోట్లుగా చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు వసూలైన జిఎస్‌టిలో ఇది రెండో అత్యధికం. ఏప్రిల్ 2022లో అత్యధికంగా రూ.1.68లక్షల కోట్ల జిఎస్‌టి వసూలై ఆల్‌టైం రికార్డుగా ఉంది. 2022ా23లో నాలుగు సార్లు రూ.1.5 లక్షల కోట్ల మార్క్ వసూళ్లు నమోదయ్యాయి. క్రితం మాసం వసూళ్లలో సిజిఎస్‌టి కింద రూ.29,546 కోట్లు, ఎస్‌జిఎస్‌టి కింద రూ.37,314 కోట్లు, ఐజిఎస్‌టి కింద రూ.82,907 కోట్లు, సెస్సుల రూపంలో రూ. 10,355 కోట్లు చొప్పున రాబడి చోటు చేసుకుంది.










