Oct 19,2023 21:17

న్యూఢిల్లీ : టెక్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతోంది. తాజాగా వ్యయ నియంత్రణలో భాగంగా నోకియా తమ 14,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు ప్రకటించింది. ఉత్తర అమెరికా సహా కీలక మార్కెట్లలో 5జి పరికరాలకు డిమాండ్‌ తగ్గడంతో.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అమ్మకాలు 20 శాతం పడిపోయాయి. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకునే పనిలో వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. 2026 నాటికి 14 శాతం నిర్వహణ లాభాలను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 14వేల మంది సిబ్బందికి ఉద్వాసన పలకడం ద్వారా కంపెనీ ఉద్యోగుల సంఖ్య 72వేలకు తగ్గనుందని నోకియా పేర్కొంది. 2024లో 400 మిలియన్ల యూరోలు, 2025లో 300 మిలియన్ల యూరోల మేరకు ఖర్చును తగ్గించుకోవాలని నిర్దేశించుకున్నామని నోకియా సిఇఒ పెక్కా లాండ్‌మార్క్‌ పేర్కొన్నారు.