Feb 21,2023 21:02

నెలలో అదాని స్టాక్స్‌ సంపద ఆవిరి
పతనంలోనే షేర్లు

న్యూఢిల్లీ : అదాని గ్రూపు షేర్లు కొనుగోలు చేసిన మదుపర్లకు పూడ్చుకోలేని నష్టాలు చవి చూస్తున్నారు. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్‌లో అదాని కంపెనీల షేర్లలో పతనం కొనసాగుతూనే ఉంది. తీవ్ర అమ్మకాల ఒత్తిడితో నెల రోజుల లోపే గౌతమ్‌ అదాని కంపెనీల సంపద రూ.11 లక్షల కోట్లు ఆవిరయ్యింది. ఇది మొత్తం అదాని గ్రూపు మార్కెట్‌ కాపిటలైజేషన్‌లో 57 శాతానికి సమానం. మంగళవారం నాటికి అదానికి చెందిన 10 స్టాక్స్‌ విలువ రూ.8.2 లక్షల కోట్లకు పడిపోయింది. హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ ముందు రోజు అయినా.. జనవరి 24న ఈ స్టాక్స్‌ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ విలువ ఏకంగా రూ.19.2 లక్షల కోట్లుగా ఉంది. గౌతమ్‌ అదానికి కీలకమైన అదాని ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ విలువ 61 శాతం క్షీణించింది. అదాని పోర్ట్స్‌ గరిష్ట స్థాయిల నుంచి 40 శాతం పడిపోయింది. షేర్ల వరుస పతనంతో ప్రపంచ కుబేరులో రెండో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదాని ఏకంగా 25 స్థానానికి పతనమయ్యారు.
మంగళవారం సెషన్‌లో అదాని ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ ధర మరో 3.55 శాతం పతనమై రూ.1,563కు పడిపోయింది. 2022 డిసెంబర్‌లో ఈ సూచీ ఏకంగా రూ.4,190 గరిష్ట స్థాయికి చేరింది. ఆ సమయంలో ఈ కంపెనీ షేర్‌ కొనుగోలు చేసిన మదుపర్లు.. భారీ నష్టాలతో బోరుమంటున్నారు. అదాని గ్రీన్‌ ఎనర్జీ 5 శాతం, అదాని టోటల్‌ గ్యాస్‌ 5 శాతం, అదాని ట్రాన్స్‌మిషన్‌ 4.99 శాతం, అదాని విల్మర్‌ 4.35 శాతం, ఎసిసి 1.15 శాతం చొప్పున పతనమయ్యాయి. అదాని పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, అదాని పవర్‌ సూచీలు మాత్రమే లాభాల్లో నమోదయ్యాయి. అదాని కంపెనీలు తీవ్ర ఎకౌంట్స్‌ మోసాలకు, కృత్రిమంగా షేర్ల ధరలను పెంచుకుంటున్నాయని హిండెన్‌బర్గ్‌ తన రిపోర్ట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ దెబ్బకు అదానిపై జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని కోల్పోయారు. దీంతో అదాని గ్రూపు కంపెనీల్లోని షేర్లను కొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ ప్రభావంతో ఆ స్టాక్స్‌ విలువ నెల రోజులగా క్రమంగా పడిపోతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మంగళవారం సెషన్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 18.82 పాయింట్లు కోల్పోయి 60,673 వద్ద నమోదయ్యింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 18 పాయింట్లు తగ్గి 17,827 వద్ద ముగిసింది.