May 16,2023 21:11
  • మూడేళ్లలో తొలగించనున్న బ్రిటన్‌ కంపెనీ
  • భారత్‌లో అమెజాన్‌ 500 మందికి ఉద్వాసన

న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం భయాలకు తోడు భవిష్యత్తు అనిశ్చిత్తిగా ఉండొచ్చనే అంచనాల్లో కార్పొరేట్‌ కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు ఏమి లేనప్పటికీ.. భారీగా పొదుపు చర్యలను చేపడుతున్నాయి. ఇందులో భాగంగా తొలుత ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రెండు దిగ్గజ కార్పొరేట్‌ కంపెనీలు వొడాఫోన్‌, అమెజాన్‌ వేల సంఖ్యలో ఉద్యోగుల కుదింపునకు దిగాయని మంగళవారం పలు రిపోర్టులు వచ్చాయి. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌ ఏకంగా 11,000 మందిని ఇంటికి పంపించాలని యోచించగా.. అమెజాన్‌ తన భారత కార్యకలాపాల్లోని 500 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ట్విట్టర్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, కాగ్నిజెంట్‌, ఐబిఎం తదితర దిగ్గజ కంపెనీలు తమ వేలాది మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేయడం, తొలగింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.
ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రపంచ వ్యాప్తంగా 9,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రెండో విడత ఉద్యోగుల తొలగింపును మార్చి నెలలోనే ఆయన ప్రకటించారు. రానున్న రోజుల్లో ఆర్ధిక అనిశ్చితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆర్థిక భారం తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఉద్వాసనలు పలికామని అమెజాన్‌ సిఇఒ యాండీ జెస్సీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందిపై వేటు వేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెలలో ఈ తొలగింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందని.. త్వరలోనే దీనిపై ఉద్యోగులకు సమాచారం అందిస్తామని జెస్సీ వెల్లడించారు. అమెజాన్‌ రెండో విడత వార్షిక ప్రణాళిక ప్రక్రియ సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. 9వేల మంది ఉద్యోగుల్లో 500 మంది భారతీయులు ఉన్నారు. వేటు పడిన వారిలో ఎక్కువ మంది వెబ్‌ సర్వీసెస్‌, హెచ్‌ఆర్‌ విభాగానికి చెందిన వారు ఉన్నారని ఆ వర్గాలు తెలిపాయి. తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు అమెజాన్‌లో 27వేల మందికి ఉద్వాసన పలికినట్లు అయ్యింది. గతంలో తొలగించిన 18,000 మందిలో రిటైల్‌, డివైజెస్‌, నియామకాలు, మానవ వనరుల విభాగాలకు చెందినవారు ఉన్నారు. తాజా ప్రక్రియలో భాగంగానే భారత్‌లోని ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు అందిస్తున్నారని సమాచారం. ఇప్పటికే కొంత మందికి తొలగింపుల పత్రాలు జారీ చేశారని ఓ ఉద్యోగి వెల్లడించారు.

  • పునర్‌వ్యవస్థీకరణలో వొడాఫోన్‌

ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్‌ వచ్చే మూడేళ్లలో భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించింది. ఆదాయ రాబడి ఆశించిన స్థాయిలోలేకపోవడంతో ఉద్వాసనలు తప్పనిసరి అయ్యాయని ఆ కంపెనీ తెలిపింది. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్‌ వచ్చే మూడేళ్లలో దాదాపు 11 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించనున్నట్లు పేర్కొంది. కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలను ఆ కంపెనీ నూతన సిఇఒ వొడాఫోన్‌ నూతన సిఇఒ మర్గెరిట డెల వాలే వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్దగా వద్ధి ఉండకపోవచ్చునని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలను తగ్గించుకోవడంలో భాగంగానే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు వొడాఫోన్‌ మర్గెరిట తెలిపారు.
'' కంపెనీ ఆర్థిక పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. ఈ సమయంలో స్థిరమైన వృద్థిని సాధించడం కోసం వొడాఫోన్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించాం. ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడమే మా తొలి లక్ష్యం. ఈ నేపథ్యంలో ఉన్న వనరులతో నాణ్యమైన సేవలను అందించేందుకు అనుగుణంగా కేటాయిస్తాము. వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో మా పెట్టుబడులను సైతం పునర్‌వ్యవస్థీకరిస్తాం. ఉద్యోగుల తొలగింపు, జర్మనీలో వ్యాపారం పునరుద్ధరించడం, బ్రిటన్‌ సహా ఇతర దేశాల్లో వ్యాపారాన్ని సులభతరం చేయడం వంటి చర్యలను చేపట్టనున్నాం.'' అని మర్గెరిట తెలిపారు.