ఇంఫాల్ : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియా ఛానెల్ ఎన్‌డిటివి బాధిత మహిళల్లో ఒకరి తల్లిని పలకరించింది. ఈ సందర్భంగా బాధిత తల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డిటివితో బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. 'నా భర్తను, కుమారుడిని చంపేశారు. మణిపూర్‌లో హింసను ఆపడానికి, ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టలేదు' అని ఆమె ఆరోపించారు. మైతీస్, కుకీస్ తెగల మధ్య ఘర్షణలు జరిగిన ఒకరోజు తర్వాత మే 4వ తేదీన తన కుమార్తెను వివస్త్రను చేసి ఊరేగించే ముందు తన భర్తను, కుమారుడిని చంపేశారని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మే 3వ తేదీన ప్రారంభమైన ఘర్షణల్ని ప్రభుత్వం నియంత్రించలేకపోయిందని ఆమె తప్పుపట్టారు.
'ఇంటర్ పూర్తి చేసిన నా చిన్న కుమారుడిని ఈ ఘర్షణల్లో పోగొట్టుకున్నాను. తనని చదివించడానికి ఎంతో కష్టపడ్డాను. నా భర్తను ఆ గుంపు చంపేసింది. ప్రస్తుతం నా పెద్ద కుమారుడికి ఉద్యోగం లేదు. మా కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే నాకేమీ ఆశాజనంగా లేదు.' అని బాధితురాలి తల్లి ఇంటర్వ్యూలో తెలిపారు.
ఊరికి తిరిగి వెళ్లలేము
ఈ నేపథ్యంలో తన గ్రామానికి తిరిగి వెళ్లాలని కూడా తనకి ఆలోచన లేదని ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. 'మా ఊరి తిరిగి వెళ్లే ఆలోచన నాకు లేదు. ఆ ఆలోచనే నా మనసులోకి రావడం లేదు. మేము తిరిగి అక్కడికి వెళ్లలేము. ఊళ్లో మా ఇళ్లు తగులబడ్డాయి. మా పొలాలు ధ్వంసమయ్యాయి. అక్కడ ఏమీ మిగలలేదు. ఇక నేను ఏముందని తిరిగి వెళ్తాను. నా గ్రామం మొత్తం కాలిపోయింది.' అని ఆమె అన్నారు.
కాగా, తన తండ్రిని, తమ్ముడిని చంపేయడం నా కూతురు తన కళ్లతో చూసింది. ఈ ఘటన తననెంతో గాయపరిచింది. దీనిపై ఏం చేయాలో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. భగవంతుడి దయతో తాను ఆరోగ్యంగా ఉన్నానని, కానీ ఈ ఘటన గురించే ఆలోచిస్తుండడం వల్ల మానసికంగా బలహీనంగా ఉన్నానని ఆమె అన్నారు.
మణిపూర్ ఘటనపై ఆ రాష్ట్ర సిఎం బీరెన్‌సింగ్ గురువారం స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఈ ఘటనలో నలుగురి నిందితులను అరెస్టు చేసినట్లు బీరెన్ తెలిపారు.