Aug 03,2023 21:30

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో కార్ప్‌ అధినేత పవన్‌ కుమార్‌ ముంజల్‌ నివాసాల్లో అనాధికార విదేశీ కరెన్సీ, పసిడి, వజ్రాభరణాలు లభ్యం అయ్యాయి. బినామి కంపెనీలతో లావాదేవీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు రెండు రోజుల పాటు ముంజల్‌ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ.25 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ, బంగారం, వజ్రాభరణాలను అధికారులు జప్తు చేశారు. బుధవారం జరిపిన తనిఖీల్లో లభించిన పత్రాలకు సరైన ఆధారాలు లేవని ఇడి అధికారులు తెలిపారు. డైౖరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ), కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సిబిఐసి) ఫిర్యాదు ఆధారంగా మానీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ)లోని వివిధ సెక్షన్ల కింద హీరో మోటో ఛైర్మన్‌, సహా ఉన్నతాధికారులపై ఇడి కేసులు నమోదు చేసింది. 2014-15 నుంచి 2018-19 మధ్య సాల్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో వివిధ దేశాలకు రూ.54 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ చట్టవిరుద్ధంగా ఎగుమతి చేశారని ఇడి గుర్తించింది. ఈ మొత్తం పవన్‌ కుమార్‌ ముంజాల్‌ వ్యక్తిగత ఖర్చుల కింద చూపారని ఆరోపణ.