Aug 25,2023 21:10

రెండు అంశాలు మినహా..
సుప్రీంకోర్ట్‌కు దర్యాప్తు స్థాయి నివేదిక
న్యూఢిల్లీ : అదానీ గ్రూపునపై రెండు ఆరోపణలు మినహా మిగతా అన్నింటిలో విచారణను పూర్తి చేశామని పెట్టుబడులు, మార్కెట్‌ రెగ్యూలేటరీ సంస్థ సెబీ వెల్లడించింది. ఈ విషయమై శుక్రవారం సుప్రీంకోర్టుకు సెబీ దర్యాప్తు స్థాయి నివేదికను అందించింది. బిలియనీర్‌ గౌతం అదానీ గ్రూప్‌ కంపెనీలు సెక్యూరిటీల చట్టాలను ఉల్లంఘించిందా లేదా అనే దానిపై దర్యాప్తు దాదాపు పూర్తయిందని పేర్కొంది. అదానీ గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్‌ కంపెనీలకు సంబంధించి మొత్తం 24 లావాదేవీలకు గానూ 22 లావాదేవీలపై తమ దర్యాప్తు పూర్తయ్యిందని సెబీ అందులో పేర్కొంది. మరో రెండు లావాదేవీలకు సంబంధించి ఇతర ఏజెన్సీల నుంచి సమాచారం రావాల్సి ఉందని తెలిపింది. అదాని కంపెనీల్లో విదేశీ పెట్టుబడుల వెనుక ఉన్న అసలు యజమానుల సమాచారం కోసం ఇంకా ఎదురుచూస్తున్నామని సెబీ తన రిపోర్ట్‌లో పేర్కొంది. దర్యాప్తు ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. సెబీ దర్యాప్తు నివేదికలలో స్టాక్‌ ధరల తారుమారు ఆరోపణలు, సంబంధిత పక్షాలతో లావాదేవీలను బహిర్గతం చేయడంలో వైఫల్యం, కొన్ని గ్రూప్‌ స్టాక్‌లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించిన ఉల్లంఘనలు ఉన్నాయని సమాచారం. అదాని కంపెనీలు తీవ్ర ఆర్థిక అవకతవకలు, ఎకౌంటింగ్‌ మోసాలు, కృత్రిమంగా షేర్ల ధరల పెంపు తదితర మోసాలకు పాల్పడుతోందని 2023 జనవరి 24న హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తీవ్ర అరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అదాని షేర్లు కుప్పకూలడంతో సాధారణ ఇన్వెస్టర్లు లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీనిపై విచారించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆగస్ట్‌ 14 కల్లా సెబీ తన విచారణను ముగించి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. కాగా.. విచారణ పూర్తి కాలేదని మరో 15 రోజుల సమయం కావాలని కోరడంతో అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తన విచారణపై స్టేటస్‌ రిపోర్టును సమర్పించింది. ఈ కేసును ఆగస్టు 29న సుప్రీంకోర్టు విచారించనుంది.