Sep 04,2023 17:05

న్యూఢిల్లీ :  సిఎఎ వ్యతిరేక నిరసనలపై విద్వేష ప్రసంగాలు చేసినందుకు బిజెపికి చెందిన అనురాగ్‌ ఠాకూర్‌, ప్రవేష్‌ వర్మపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్న సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌, పార్టీ ఢిల్లీ కార్యదర్శి కెఎం తివారీ వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబరు 3కి వాయిదా వేసింది. తొలుత బిజెపి నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ట్రయల్‌ కోర్టు తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ ఆదేశాలను బృందాకరత్‌ సవాలు చేశారు.
ఈ కేసు విచారణను వాయిదా వేయాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు కోరడంతో జస్టిస్‌ అభరు ఎస్‌.ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌లతో కూడిన బెంచ్‌ వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులకు తదుపరి వాయిదా మంజూరు చేయబోమని సుప్రీం తెలిపింది. బృందాకరత్‌ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ పోలీసులకు ఏప్రిల్‌ 17న సుప్రీం నోటీసులు జారీ చేసింది.
విద్వేష ప్రసంగాలు చేసినందుకు ఆ ఇద్దరు బిజెపి ఎంపీలపై సిపిఎం నేతలు బృందాకరత్‌, కె.ఎం.తివారీ దాఖలు చేసిన పిటిషన్‌ను గతేడాది జూన్‌ 13న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ట్రయల్‌ కోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటే తగిన అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం వుందని పేర్కొంది.
ఆ ఇద్దరు బిజెపి నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఫలితంగా ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్న రెండు వేర్వేరు ప్రాంతాల్లో మూడు కాల్పుల సంఘటనలు చోటుచేసుకున్నాయని పిటిషనర్లు తెలిపారు. బిజెపితోపాటు విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ తదితర సంస్థల నాయకులు ఢిల్లీలోని నాంగ్లోరు, ఘోండా చౌక్‌తోపాటు వివిధ ప్రదేశాల్లో జరిగిన బహిరంగ సభల్లో హిందూ మతం పేరుతో ముస్లిం సమాజంపై ప్రజలను రెచ్చగొట్టారని పిటిషన్‌లో సిపిఎం నేతలు పేర్కొన్నారు. 'హిందూ మతం పేరుతో రాజ్యాంగ విలువలు, లౌకికవాదానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టారు. దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో ఇటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. ముస్లిం సమాజంపై ఆర్థిక, సామాజిక బహిష్కరణకు నిరంతరం పిలుపు ఇస్తున్నాయి' అని తెలిపారు.