
బిజెపి విచ్ఛిన్నకర రాజకీయాలపై
బృందా కరత్, మరియం దావలే వ్యాఖ్య
బాధితులకేదీ సాయం?
ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను తక్షణమే తొలగించాలి
గవర్నర్ ఆందోళన సముచితమే
రాష్ట్రపతి కలిసేందుకు సమయం కోరాం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఈరోజు మణిపూర్‌లో జరిగిందీ, రేపు దేశంలో మరెక్కడైనా పునరావృతం కావచ్చని ఐద్వా ప్యాట్రన్ బృందా కరత్, ప్రధాన కార్యదర్శి మరియం ధావలే పేర్కొన్నారు. మణిపూర్ హింసాకాండ కారణంగా ఉద్యోగాలు, ఆదాయాన్ని కోల్పోయిన వారికి తక్షణమే ఆహారం, ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9 నుంచి 11 వరకు మణిపూర్ లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఐద్వా బృందం బుధవారం నాడిక్కడ పండిట్ రవి శంకర్ శుక్లా మార్గ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మణిపూర్‌లో మే 3 నుంచి సామాన్య ప్రజల జీవనం స్తంభించిపోయిందని, భౌగోళికంగా, మానసికంగా మణిపూర్ రెండుగా విభజించబడిందని అన్నారు. ఎవరూ పనికి వెళ్లలేరని, బియ్యం ధర విపరీతంగా పెరిగిపోయిందని తెలిపారు. చాలా కుటుంబాలకు ఒక పూట మాత్రమే భోజనం ఉంటుందని, అందరికీ 10 కిలోల ధాన్యం, ఇతర ఆహార పదార్థాలు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఆధార్ అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో శాంతికి అతిపెద్ద అవరోధం న్యాయం నిరాకరించడమని, న్యాయపాలనకు ప్రధాన అడ్డంకి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అని విమర్శించారు. క్రూరమైన హింసకు గురైన మహిళలు అన్నీ మరిచిపోయి క్షమించాలని నిస్సిగ్గుగా ఆయన అంటున్నారని దుయ్యబట్టారు. కులం, మతం ఆధారంగా మహిళలపై దాడులు జరిగాయని, వారికి న్యాయం చేయాలని కోరారు.
శాంతి స్థాపనకు తొలి అడుగుగా బీరేన్ సింగ్‌ను తొలగించాలని పేర్కొన్నారు. మణిపూర్‌తో భారత్ ఉందని మోడీ చెప్పడం సరికాదని, భారతదేశం, భారతీయులు మాత్రమే మణిపూర్‌తో ఉన్నారు. ప్రధాని మోడీ, బిజెపి మణిపూర్‌తో లేవని అన్నారు. మణిపూర్‌ను బిజెపి మోసం చేసిందని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. హింసాకాండపై రాష్ట్ర గవర్నర్ ఆందోళన సముచితమేనని అన్నారు. హింసాకాండకు పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను గవర్నర్ ఆదేశించారని, కానీ ఇంత వరకూ ఏమీ జరగలేదని తెలిపారు. మణిపూర్ పరిణామాలను రాష్ట్రపతికి వివరించేందుకు సమయం కోరామని చెప్పారు.