హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. రాఖీ పౌర్ణమి నేపథ్యంలో గురువారం ఒక్కరోజే రూ.22.65 కోట్ల రాబడిని ఆర్జించింది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్‌టైమ్ రికార్డు అని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.గతేడాది రాఖీ పండగ నాడు రూ.21.66 కోట్ల ఆదాయం సమకూరగా.. ఈసారి దాదాపు రూ.కోటి వరకు అదనంగా లభించింది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 40.91లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. గత ఏడాదితో పోలిస్తే అదనంగా లక్ష మంది రాకపోకలు సాధించారు. ఒక్కరోజులో ఇంత పెద్ద సంఖ్యలో ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) విషయంలో ఉమ్మడి నల్గండ జిల్లా గతేడాది రికార్డును అధిగమించింది. 2022లో రాఖీ పండుగ నాడు 101.01 ఓఆర్ సాధించగా.. ఈసారి 104.68 శాతం నమోదు చేసింది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో.. నార్కెట్‌పల్లి మినహా మిగతా అన్నీ 100 శాతానికి పైగా ఓఆర్ సాధించాయి. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో 97.05 శాతం.. ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది.ప్రజా రవాణా వ్యవస్థ వెంటే తామంతా ఉన్నామని ప్రజలు నిరూపించారని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ చెప్పారు. సంస్థ తరఫున ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రాఖీ పండగ నాడు సిబ్బంది ఎంతో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు పండగరోజును త్యాగం చేసి మరీ విధులు నిర్వర్తించారన్నారు.