Aug 31,2023 22:29

సెమీస్‌లో గోవా ఎఫ్‌సిపై 2-1గోల్స్‌తో గెలుపు
డురండ్‌ కప్‌-2023
కోల్‌కతా: 132వ డురండ్‌ కప్‌ ఫైనల్లోకి మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్‌ జట్టు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో మోహన్‌ బగాన్‌ జట్టు 2-1గోల్స్‌ తేడాతో గోవా ఎఫ్‌సిపై విజయం సాధించింది. తొలి అర్ధభాగంలోనే గోవా స్ట్రయికర్‌  జంటరి(మొరాకో) తొలి గోల్‌ చేయడంతో ఆ జట్టు 1-0 ఆధిక్యతలో నిలిచింది. రెండో అర్ధబాగంలో మోహన్‌ బగాన్‌ ఫార్వర్డ్‌ ఆటగాడు, అల్బేనియాకు చెందిన అర్మాండో సాధి గోల్‌ చేయడంతో 1-1గోల్స్‌తో సమమైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా స్ట్రయికర్‌ జాసన్‌ కమ్మింగ్స్‌ పెనాల్టీని గోల్‌గా మలచడంతో మోహన్‌ బగాన్‌ విజయం ఖాయమైంది. గోవా సెంటర్‌ బ్యాక్‌ ఆటగాడు సందేశ్‌ జింఘాన్‌ బంతిని నిలువరించడంలో విఫలం కావడంతో మోహన్‌ బగాన్‌ జట్టు గెలిచింది. ఇక ఇక మోహన్‌ బగాన్‌ జట్టు గత ఏడాది టైటిల్‌ను గెలుచుకుంది. 2000 ఫైనల్లో ఈస్ట్‌బెంగాల్‌నూ ఓడించింది. ఆ తర్వాత 2004లో ఢిల్లీలోని అంబేద్కర్‌ స్టేడియంలో 2-1గోల్స్‌ తేడాతో గెలిచింది. కానీ 2019 డురండ్‌ కప్‌ ఫైనల్లో 2-1గోల్స్‌ తేడాతో గోకులం కేరళ ఎఫ్‌సి చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపుచ్చుకుంది. సెప్టెంబర్‌ 3న జరిగే ఫైనల్లో మోహన్‌ బగాన్‌ జట్టు టైటిల్‌కై ఈస్ట్‌బెంగాల్‌తో తలపడనుంది.