
ప్రజాశక్తి-గ్రోత్ సెంటర్ (ప్రకాశం జిల్లా) :విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌తో కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి సుమారు రూ.పది కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలంలోని గ్రోత్ సెంటర్లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలం నుండి ప్రసాద్ ఆర్గానిక్స్ అనే కెమికల్ ఫ్యాక్టరీలో పెర్‌ఫ్యూమ్స్ తయారుచేస్తున్నారు. ఉదయం ఆరు గంటల సమయంలో కార్మికులు విధులు నిర్వహిస్తుండగానే.. ఫ్యాక్టరీలో విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన కార్మికులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఒంగోలు, అద్దంకికి చెందిన రెండు ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా ప్రయత్నించి మధ్యాహ్నం 12.30కు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని ఖరీదైన మిషనరీ, పెర్‌ఫ్యూమ్‌కి ఉపయోగించే ద్రావణం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టమూ జరగక పోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.