Jul 29,2023 21:33

- అంతర్జాతీయ పులుల దినోత్సవ సభ 
ప్రజాశక్తి - ఎస్‌వియు క్యాంపస్‌ (తిరుపతి) :పులుల సంఖ్య పెరిగితే అటవీ సంపదకు రక్షణ ఉంటుందని రాష్ట్ర విద్యుత్‌, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 2010లో 45 పులులు ఉంటే నేడు 80కి పెరిగాయని, దీంతో శేషాచలం, నల్లమల అభయారణ్యాలను కలుపుతూ కారిడార్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్లోబల్‌ టైగర్‌ డే వేడుకలను శనివారం తిరుపతి ఎస్‌వి జూ పార్క్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పులుల సంరక్షణకు రష్యాలో జరిగిన సమావేశంలో బీజం పడిందన్నారు. ఆనాటి నుండి ప్రతి ఏడాదీ జులై 29న గ్లోబల్‌ టైగర్‌ డే జరుపుకుంటున్నామని తెలిపారు. శేషాచల అభయారణ్యంలో నేడు పెద్ద పులులు లేవని అయితే మామండూరు వద్ద గెస్ట్‌ హౌస్‌ నందు బ్రిటిష్‌ వారు వేటాడినట్లు రికార్డ్స్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. నల్లమల, శేషాచల అభయారణ్యయాలను కలుపుతూ కారిడార్‌ ఏర్పాటు చేయడంతో నల్లమలలో ఉన్న పెద్ద పులులు ఇక్కడికి రావడానికి వీలుంటుందని చెప్పారు. శ్రీశైలం నాగర్జునసాగర్‌ టైగర్‌ జోన్‌ ప్రస్తుతం ఎనిమిది లక్షల ఎకరాల్లో ఉందని, దీనికి మరో ఐదు లక్షల ఎకరాలు పెంచేలా సిఎం ప్రతిపాదనలు చేశారని తెలిపారు. టైగర్‌ డే సందర్భంగా నిర్వహించిన వివిధ వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, అటవీ సంరక్షణలో ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిసిసిఎఫ్‌ మధుసూధన్‌ రెడ్డి, అడిషనల్‌ పిసిసిఎఫ్‌ శాంతిప్రియ పాండే, సిసిఎఫ్‌ నాగేశ్వర రావు, జూ పార్క్‌ క్యూరేటర్‌ సి.సెల్వం, స్టేట్‌ సిల్వికల్చరిస్ట్‌ యశోదా బారు, తిరుపతి డిఎఫ్‌ఒ సతీష్‌ రెడ్డి పాల్గొన్నారు.