Mar 13,2023 21:12

న్యూయార్క్‌ : అమెరికాలో మూడు రోజుల్లోనే రెండు బ్యాంక్‌లు మూత పడ్డాయి. సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (ఎస్‌విబి) సంక్షోభం ముగిసి పోకముందే సిగేచర్‌ బ్యాంక్‌ దివాలా తీసింది. దీంతో సిగేచర్‌ బ్యాంక్‌ను కూడా మూసివేశామని అమెరికా రెగ్యూలేటరీ సంస్థ ది ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డిఐసి) ఆదివారం ప్రకటించింది. న్యూయార్క్‌ కేంద్రంగా పని చేస్తోన్న సిగేచర్‌ బ్యాంక్‌ ఎక్కువగా కృత్రిమ విలువ కలిగిన క్రిప్టో డిపాజిట్లను కలిగి ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 2022 డిసెంబర్‌ ముగింపు నాటికి 110.36 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.9 లక్షల కోట్ల పైగా) ఆస్తులతో పాటు 88.59 బిలియన్‌ డాలర్ల (రూ.7.30 లక్షల కోట్లు) డిపాజిట్లను కలిగి ఉంది. బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లలో మూడో వంతు క్రిప్టో కరెన్సీ నుంచి వచ్చినవి కావడం గమనార్హం. డిపాజిట్‌దారులు తమ సొమ్మును వెనక్కి తీసుకోవడానికి వీలుగా తాత్కాలికంగా బ్రిడ్జి బ్యాంక్‌ను ఏర్పాటు చేశామని ఎఫ్‌డిఐసి తెలిపింది. ఈ బ్యాంక్‌ స్థిరాస్తి, క్రిప్టో ఆస్తులతో పాటు తొమ్మిది విభాగాల్లో ఖాతాదారులకు సేవలందిస్తుంది. కాగా.. ఎస్‌విబి, సిగేచర్‌ బ్యాంక్‌ల పతనానికి కారకులైన వారిపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ స్పష్టం చేశారు. అలాగే డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని హామీ ఇచ్చారు. మరోవైపు ఎస్‌విబి బ్రిటన్‌ కార్యకలాపాలను దివాలా ప్రక్రియ కింద కేవలం ఒక్క పౌండ్‌ (రూ.99)కే హెచ్‌ఎస్‌బిసికి అప్పగిస్తూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నిర్ణయం తీసుకోవడం విశేషం.