- వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా ఏటా రూ. 10 వేల ఆర్థిక సహాయం
- కాకినాడ ఎంపీ వంగా గీత
ప్రజాశక్తి-కాకినాడ : రాజకీయాలను, సంక్షేమంతో ముడిపెట్టకుండా అన్ని వర్గాల ప్రజల బాగోగుల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలుతో కృషిచేస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, ఎండీయూ డ్రైవర్లకు అయిదో విడతలో రూ. 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విజయవాడలో ప్రారంభించగా ఈ పథకానికి సంబంధించిన జిల్లాస్థాయి కార్యక్రమం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళామందిర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ నగరపాలక సంస్థ మాజీ మేయర్ సుంకర శివ ప్రసన్న, కాకినాడ పట్టణ మార్కెటింగ్ కమిటీ ఛైర్‌పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, డీటీసీ ఎ.మోహన్, ఆటోయూనియన్ల ప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ సమాజంతో అత్యంత దగ్గర సంబంధమున్న వ్యక్తులు వాహనమిత్రలు అని సురక్షితమైన, సమయాన్ని ఆదాచేసే ప్రయాణ సౌకర్యాన్ని ప్రజలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు తీసుకెళ్తూ, అత్యవసర సమయాల్లో ప్రజలను ఆసుపత్రులకు తీసుకెళ్తూ ఆటో డ్రైవర్లు సమాజానికి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. 2019 నుంచి వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా అర్హులైన సొంత ఆటోరిక్షా, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, ఎండీయూ కలిగిన డ్రైవర్లకు మరమ్మతులు, ఇన్సూరెన్స్ ఖర్చులు వంటి వాటికోసం ప్రభుత్వం ఏటా పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోందని వివరించారు. కులం, మతం, వర్గం, రాజకీయాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. గతంలో ఆటో ప్రమాదాలు, క్వారీ లారీ ప్రమాదాలు ఎక్కువగా జరిగేవని ఇప్పుడు ఆ ప్రమాదాలు బాగా తగ్గినట్లు ఎంపీ వంగా గీత తెలిపారు.










