ప్రజాశక్తి-కాకినాడ : దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి, వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తూ రైతులకు ధీమా, భరోసా కల్పిస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. శుక్రవారం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ మైదానంలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళా-2 కింద రైతు గ్రూపులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాలను అందించే జిల్లాస్థాయి కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గుంటూరులో రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కాకినాడ ఎంపీ వంగా గీత, కలెక్టర్ డా. కృతికా శుక్లా, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజయ్‌కుమార్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ. 4.16 కోట్లు రాయితీ సొమ్ము మెగాచెక్‌ను రైతులకు అందించారు. అనంతరం జెండా ఊపి ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ప్రారంభించి రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ రైతు సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషిచేశారని ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదే బాటలో నడుస్తున్నారని పేర్కొన్నారు. పంటసాగులో రైతు వేసే ప్రతి అడుగులోనూ ప్రభుత్వం తోడుగా ఉంటోందని వైఎస్సార్ యంత్రసేవా పథకంతో పెట్టుబడి తగ్గి రైతులు అధిక లాభం పొందేందుకు అవకాశముంటుందన్నారు. శాసనసభ్యులు కన్నబాబు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి వివిధ పథకాలు రూపుదిద్దుకున్నాయని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.
- సాగును లాభసాటిగా మార్చేందుకే : కలెక్టర్ కృతికా శుక్లా
కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద మెగామేళా-2ను ఏర్పాటు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మెగామేళా-2లో భాగంగా కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల రైతు గ్రూపులకు రూ. 5.91 కోట్ల విలువైన 75 ట్రాక్టర్లను రూ. 2.29 కోట్ల రాయితీతో అందించినట్లు తెలిపారు. అదే విధంగా రూ. 1.25 కోట్ల విలువైన అయిదు కంబైన్డ్ హార్వెస్టర్లను రూ. 44 లక్షల రాయితీతోనూ రూ. 4.61 కోట్ల విలువైన 230 వివిధ వ్యవసాయ యంత్ర పరికరాలను రూ. 1.42 కోట్ల రాయితీతో అందించినట్లు వివరించారు. ఒక్కో రైతు బృందానికి యంత్ర పరికరాలను 40 శాతం సబ్సిడీ, 50 శాతం బ్యాంకు రుణం, 10 శాతం రైతు గ్రూప్ వాటాతో ప్రభుత్వం అందిస్తోందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాల ప్రయోజనాలు కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాల ద్వారా గ్రామాల్లోని అందరి రైతులకు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) పరిధిలో సీహెచ్‌సీలను ఏర్పాటుచేసినట్లు వివరించారు. కూలీల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సాగుపరంగా ఎదురవుతున్న సమస్యల నుంచి రైతును గట్టెక్కించేందుకు, డబ్బును, సమయాన్ని ఆదా చేసి సాగును లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ యంత్రసేవ పథకాన్ని ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలుచేస్తోందని కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి విప్లవాత్మక విధానాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్, నవంబర్‌లోని తుపాన్లకు, భారీ వర్షాలకు పంట దొరక్కుండా ముందుగానే అంటే గతేడాది నుంచి జూన్ 1నే కాలువలకు నీరు విడుదల చేయడం జరుగుతోందన్నారు. జూన్ 1వ తేదీన కాలువలకు నీరువిడుదల చేయడం వల్ల గతేడాది ఖరీఫ్‌కు సంబంధించి దాదాపు 35 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లకుండా కాపాడుకోగలిగామని వివరించారు. అదే విధంగా ముందుగానే నీటి విడుదలతో మూడో పంటకు కూడా అవకాశం ఏర్పడుతుందన్నారు. రైతులను ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మెట్ట ప్రాంతంలో చిరు ధాన్యాల సాగును కూడా ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు.
- రైతుకు అన్ని విధాలా అండగా ప్రభుత్వం : శాసనసభ్యులు కురసాల కన్నబాబు
కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మానవ వనరులు చాలా ముఖ్యమైనవని కూలీల కొరతను అధిగమించి సాగును లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి రైతుల పక్షపాతిగా వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్‌బీకేలకు అనుసంధానంగా కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులకు ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో వ్యవసాయ యాంత్రీకరణ అవసరం ఏంటనేది బాగా తెలిసిందని అప్పట్లో బయటి రాష్ట్రాల నుంచి హార్వెస్టర్లను తీసుకొచ్చి వినియోగించినట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్సార్ యంత్రసేవా పథకం ద్వారా 40 శాతం రాయితీతో ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను అందించడం జరుగుతోందన్నారు. గతంలో ఎప్పడులేని విధంగా ఇప్పుడు రైతులకు మేలు జరుగుతోందన్నారు. గ్రామాల్లో గ్రామీణ వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, పశుసంవర్ధక సహాయకులు నైపుణ్యమున్న సిబ్బందిని నియమించి రైతుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సహాయసహకారాలు పూర్తిస్థాయిలో అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయ్‌కుమార్, పశు సంవర్ధక అధికారి డా. ఎస్.సూర్యప్రకాష్‌రావు, కాకినాడ రూరల్ జెడ్‌పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులు తదితరులు హాజరయ్యారు.










