- జాయింట్ కలెక్టర్ ఇలక్కియ వెల్లడి
ప్రజాశక్తి-కాకినాడ : వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా నాలుగో ఏడాది కాకినాడ జిల్లాలో 46,557 మంది లబ్ధిదారులకు రూ. 69.83 కోట్ల మేర లబ్ధి జరుగుతోందని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తెలిపారు. శనివారం వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన మహిళలకు రూ. 15 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాస్థాయి కార్యక్రమం బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వివేకానందహాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ ఆవాల రాజేశ్వరి, వివిధ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి వైఎస్ఆర్ కాపునేస్తం ఆర్థిక సహాయాన్ని విడుదల చేసిన అనంతరం జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ ఆవాల రాజేశ్వరి, బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో కలిసి లబ్ధిదారులకు మెగా చెక్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.
- పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : జేసీ ఇలక్కియ
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ ఈ వర్గం ఆ వర్గమని కాకుండా సమాజంలోని అన్ని వర్గాల్లోని పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఆయా వర్గాల్లోని మహిళల ఆర్థిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని వీటిని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. వైఎస్ఆర్ కాపునేస్తం పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు అర్హులైన మహిళలకు ఏటా రూ. 15 వేల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి, తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాపునేస్తం పథకానికి సంబంధించి కాకినాడ జిల్లాలో చూస్తే 2020-21లో 44,957 మంది లబ్ధిదారులకు రూ. 67.43 కోట్లు, 2021-22లో 40,332 మంది లబ్ధిదారులకు రూ. 60.49 కోట్లు, 2022-23లో 44,395 మంది లబ్ధిదారులకు రూ. 66.59 కోట్లు, 2023-24లో 46,557 మంది లబ్ధిదారులకు రూ. 69.83 కోట్లు మేర లబ్ధి జరిగిందని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ వివరించారు. కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమ అధికారి టీవీ ప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ జి.సతీష్, బీసీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ బి.రమావతి, వివిధ ప్రాంతాల లబ్ధిదారులు తదితరులు హాజరయ్యారు.










