ప్రజాశక్తి-కాకినాడ : అన్నదాతల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోందని, ఈ విప్లవాత్మక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో డా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖరీఫ్-2022లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వాటిల్లిన రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారాన్ని జమచేసే ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా కలెక్టరేట్ వివేకానందహాల్‌లో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి కార్యక్రమం నుంచి వర్చువల్‌గా ఎంపీ వంగా గీత, జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, జిల్లా వ్యవసాయ ప్రధాన అధికారి ఎన్.విజయ్‌కుమార్, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్‌పర్సన్ ఎల్.ప్రసాద్, వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, అధికారులు హాజరయ్యారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు పూల మాలలువేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి రైతు దినోత్సవం సందర్బంగా అన్నదాతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఖరీఫ్-2022 సీజన్‌కు సంబంధించి డా. వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకం లబ్ధి రూ. 12 కోట్ల మెగాచెక్‌ను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ రైతులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి, రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు వివరించారు. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసి విత్తు నుంచి విక్రయం వరకు ప్రతిదశలోనూ రైతులకు అండగా నిలుస్తోందని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు.
- అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక : కలెక్టర్ కృతికా శుక్లా
రైతులు బాగుంటే సమాజం బాగుంటుంది అందుకే రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. ఖరీఫ్-2022 సీజన్‌కు సంబంధించి డా. వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా పథకం ద్వారా జిల్లాకు చెందిన 16,811 మంది రైతులకు రూ. 12 కోట్ల మేర లబ్ధి జరుగుతున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వై.ఎస్.ఆర్ రైతు భరోసా, వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా, వై.ఎస్.ఆర్.యంత్ర సేవ, రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ; రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ఇలా వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పథకానికి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపికచేసి ఆర్‌బీకేల్లో సోషల్ ఆడిట్‌కోసం జాబితాలను ప్రదర్శిస్తున్నట్లు వివరించారు. అత్యంత పారదర్శకంగా ఈ-క్రాప్, ఈ-కేవైసీ ఆధారంగా రైతు కేంద్రీకృత పథకాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లాకు ఆరు సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు మంజూరయ్యాయని జగ్గంపేట ల్యాబ్ ప్రస్తుతం పనిచేస్తోందని రూ. కోటితో ఏర్పాటుచేసిన శంఖవరం ల్యాబ్ కూడా రైతులకు సేవలందించేందుకు సిద్ధమైందన్నారు. రైతులు ఖరీఫ్ సీజన్‌లోనూ మంచి దిగుబడులు సాధించి, కుటుంబం అంతా సుఖసంతోషాలతో హాయిగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లు కలెక్టర్ డా. కృతికా శుక్లా పేర్కొన్నారు.










