Feb 02,2023 06:42

రాజధాని అంశం దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ విశాఖపట్నం త్వరలో రాష్ట్ర రాజధాని కాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారంనాడు చెప్పడం కలకలం రేపింది. ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్‌ డిప్లమాటిక్‌ అలయెన్స్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ మార్చి మూడు, నాలుగు తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సుకు వారిని రమ్మని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రమని, దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉందనీ, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో కూడా గడిచిన మూడేళ్లుగా ఏపి దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో నిలిచిందనీ చెప్పారు. రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందని, ఆరు పోర్టులు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా మరో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నట్లు, ఆరు విమానాశ్రయాలు కూడా ఉన్నాయనీ, రాష్ట్రంలోని ప్రకృతి వనరులను గురించి చెప్పడాన్ని తప్పుబట్టలేం. పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించాలనీ, పెట్టుబడులను రాబట్టాలనీ ప్రయత్నించడం తప్పు కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత కూడా! అయితే, మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఉపసంహరించుకోవడం, అమరావతిని రాజధానిగా అభివద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించడం, సుప్రీం కోర్టులో సంబంధిత కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేయడం సబబేనా అన్నది పలువురి సందేహం. ముఖ్యమంత్రి ప్రకటన కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందన్న కొందరి అభియోగాన్ని కూడా తీసి పారెయ్యలేం.
అమరావతి రాజధానిగా రాష్ట్ర అసెంబ్లీలో నాడు వైసిపి సహా ఏకగ్రీవ ఆమోదం పొందింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతిని రాజధానిగా అంగీకరించాయి. రాజధాని నిర్మాణం కోసం రైతులు వేల ఎకరాల భూములను ప్రభుత్వానికిచ్చారు. అమరావతి అభివద్ధికి ఇప్పటికే వేల కోట్ల రూపాయలను సర్కారు ఖర్చు చేసింది. అయితే అంత భారీ విస్తీర్ణంలో సినీ గ్రాఫిక్స్‌ లాంటి నిర్మాణాలను చూపి అమరావతిని ఓ భ్రమరావతిగా మార్చిన గత ప్రభుత్వ నిర్వాకాన్ని తప్పక తప్పుబట్టాల్సిందే. అయితే ఏకంగా ఆ ప్రదేశంలోనే రాజధాని ఉండబోదని కొత్తగా వచ్చిన ప్రభుత్వం చెప్పడం తగదు. ఏ రాజకీయపార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థగా కొనసాగుతుంది. ఆ సూత్రం ప్రకారం కూడా అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా కొనసాగాలి.
ఉమ్మడి రాష్ట్ర విభజన మూలంగా అవశేష ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయింది. ఒకే రాష్ట్రంలో ఉన్నా కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉండడం లేదా నిర్లక్ష్యం చేయబడడం వల్ల వేర్పాటువాదానికి ఊతమొచ్చింది. విభజన గాయాలను ఎవరూ మరువరాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిందే. అందుకు బాధ్యత కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. కాని, రాష్ట్రాభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదాను కేంద్రం తిరస్కరించడమేగాక విభజన హామీలను కూడా తుంగలో తొక్కుతోంది. అయినా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని నిలదీయడంలేదు సరికదా వారికి తోడుగా నిలవడం విచారకరం. నిజానికి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంటే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి అంతగా ప్రయాస పడకుండా వారే క్యూ కట్టేవారు. కాబట్టి హోదాపై రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్ర బిజెపిని నిలెయ్యడం, దాని మెడలు వంచి హోదా సాధించడమే మార్గం.
వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. జంఝావతి, వంశధార తదితర పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తికి కావలసిన నిధులు కేటాయించాలి. ప్రాణ బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వకుండా కార్మికవర్గం సాగిస్తున్న పోరాటానికి అన్ని పార్టీలు అండగా నిలవాలి. ఉమ్మడిగా పట్టుబట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరింపజేయాలి. ఇలాంటివి చేయకుండా విశాఖను రాజధానిగా ప్రకటించినంత మాత్రాన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు, కొంతమంది సంపన్నులకు లబ్ధి చేకూరుతుందే తప్ప సామాన్య ప్రజలకు, రాష్ట్రానికీ ఒరిగేదేమీ ఉండదని గుర్తెరగాలి!