Apr 13,2023 06:44

ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చే వారధులు ఉద్యోగులు. ప్రభుత్వ వ్యవస్థను నడపడంలో వీరిది ముఖ్య పాత్ర. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని నాటి ప్రతిపక్ష పార్టీ, నేటి పాలక పార్టీ వైసిపి...2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీలు ఇచ్చింది. అంతేకాక ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించిన 11 హామీలను చేర్చింది. ''సిపిఎస్‌ రద్దు చేస్తాం, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తాం, అన్ని ప్రభుత్వ శాఖల లోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తాం, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తాం, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పని చేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం...'' వంటివి వాటిలో ముఖ్యమైనవి. గత ప్రభుత్వ కాలంలో పోరాడిన అనేక అంశాలను అమలు చేస్తామంటూ మేనిఫెస్టోలో చేర్చడంతో ఉద్యోగులు, వారి కుటుంబీకులలో అధిక భాగం ఎన్నికలలో మద్దతుగా నిలిచారు. దాంతో వైసిపి అత్యధిక సీట్లతో అధికారంలోకి రాగలిగింది. ఈ మూడున్నర సంవత్సరాల నుండి ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురుచూసిన ఉద్యోగులకు నిరాశ, నిస్పృహలే మిగిలాయి.
పిఆర్‌సి సకాలంలో అమలు జరుపుతాం. 27 శాతం ఐ.ఆర్‌ అమలు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చారు. సహజంగానే ఉద్యోగులు 27 శాతం కన్నా అధికంగానే ఫిట్మెంట్‌ ఉంటుందని ఊహించారు. కానీ దీనికి భిన్నంగా 27 శాతం ఐ.ఆర్‌ లో కోత విధించి 23 శాతం ఫిట్మెంట్‌తో పిఆర్‌సి ని అమలు అమలు చేసింది. ఈ పిఆర్‌సి తో ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అంతకు మించి ఇది అమలు జరిపిన తీరు, ఈ సందర్భంగా ఉద్యోగులపై తమ పత్రికలో రాసిన రాతలు వారిలో తీవ్రమైన అసంతృప్తిని, అవమానాన్ని మిగిల్చింది. దాని ఫలితమే ఫిబ్రవరి 3న విజయవాడ బిఆర్‌టిఎస్‌ రోడ్డులో ఉద్యోగులు ఉద్యమించారు.
అధికారంలోకి వచ్చిన వారం లోగా సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ అమలు చేస్తామన్న హామీ అమలు కోసం ఐదున్నర లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. మూడున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ హామీ అమలు కాలేదు. అమలు చేయకపోగా ఈ హామీ అవగాహన లేక ఇచ్చామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పుడు సిపిఎస్‌ లోనే చిన్న చిన్న మార్పులు (గ్యారెంటీ లేని చివరి వేతనంలో 33 శాతం సర్వీస్‌ పెన్షన్‌, ఫ్యామిలీ పెన్షన్‌, ఉద్యోగి ప్రమాద బీమా) చేసి జిపిఎస్‌ పేరుతో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇది కచ్చితంగా ఓపిఎస్‌ కు ప్రత్యామ్నాయం కాదు. సిపిఎస్‌ కు ఓపిఎస్‌ తప్ప మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించమని ఉపాధ్యాయ సంఘాలు కరాఖండిగా తేల్చి చెప్పాయి. అన్ని ప్రభుత్వ శాఖలలో సుమారు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వీరంతా ఏళ్ల తరబడి రెగ్యులరైజేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో ఒక్కరిని కూడా రెగ్యులరైజ్‌ చేయలేదు. ఉద్యోగులకు 6 నెలలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏలు ప్రకటించడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న డిఏలు అన్నింటిని కలిపి పిఆర్‌సి లో ఇచ్చి వాటి ఎరియర్లన్నింటిని రిటైర్మెంట్‌ తర్వాత తీసుకోమని చెప్పింది. ఇప్పటికీ మూడు డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగులు దాచుకున్న పిఎఫ్‌, ఎపిజెఎల్‌ఐ సొమ్ము నుండి కుటుంబ అత్యవసరాల కోసం పెట్టుకునే లోన్ల కోసం ఉద్యోగులు సంవత్సరాల తరబడి ఎదురు చూడవలసి వస్తున్నది. చివరికి నెల మొత్తం పని చేసి ఒకటో తారీకు జీతం కోసం కూడా ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయి.
ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం ప్రాతినిధ్యం చేయడం, ప్రశ్నించడం, ప్రతిఘటించడం చేస్తుంటారు. ఇది ప్రజాస్వామిక హక్కు. పిఆర్‌సి సమయంలో వేతనాల్లో కోత విధించడమే కాకుండా దాన్ని అమలు చేయడానికి వారిపై ప్రభుత్వం చేసిన వ్యతిరేక ప్రచారంతో విస్తుపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు 2021 ఫిబ్రవరి 3న విజయవాడలో లక్ష మందితో చేసిన పోరాటంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. సిపిఎస్‌ రద్దు కోసం ఉపాధ్యాయ సంఘాలు, సిపిఎస్‌ సంఘాలు సిఎం కార్యాలయం ముట్టడి, సచివాలయం ముట్టడి వంటి పోరాటాలు, ధర్మదీక్షలు నిర్వహించాయి. ఒకటో తారీకు జీతాల కోసం కూడా వినూత్న పద్ధతులలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం పోరాడడం కొత్తేమీ కాదు. పోరాటాలు ఇప్పుడే ప్రారంభం కాలేదు. ప్రభుత్వం వారి ఆవేదనను ఆలకించి, సమస్యలను చర్చించి పరిష్కారం చేయవచ్చు. అయితే అందుకు భిన్నంగా పోరాటం చేస్తున్న ఉపాధ్యాయులపైన ఆంక్షలు విధించడమే కాకుండా...వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నది. ఇన్నేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా కొన్ని వేల మంది ఉపాధ్యాయులపై బైండోవర్‌ కేసులు, ఏదో ఒక సెక్షన్‌ కింద రెండు లేదా అంతకు మించి ఎక్కువ కేసులు బనాయిస్తున్న పరిస్థితి.
సానుకూల వైఖరితో చర్చించి పరిష్కరించడం ద్వారానే ఉద్యోగులను, ఉద్యమాలను శాంతింపచేయగలం తప్ప...ఆంక్షలు, నిర్బంధాలతో కాదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఈ సత్యాన్ని మరిచిన అనేక ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకున్నాయి. ఉద్యోగులకు న్యాయంగా ఇవ్వవలసిన వాటిని అందించడం ప్రభుత్వ బాధ్యత. లేనిపక్షంలో వారి ముందు పోరు బాట వుండనే వుంది.

article-by-venkateswarao

 

 

 

 


( వ్యాసకర్త : జి. వెంకటేశ్వరరావు, 9966135289 )