- వెన్నుపోటు దారుడు చంద్రబాబు
- బాబు మాటలు ఎన్టీఆర్ ఆత్మకు క్షోభ
- ఆక్రోశంతోనే జగన్ పై విమర్శలు
- మళ్లీ గెలిచేది జగనే
- ప్రెస్మీట్లో ఎమ్మెల్యే, మేయర్
ప్రజాశక్తి కర్నూలు క్రైమ్ : టిడిపి రాజమండ్రిలో నిర్వహిస్తున్నది మహానాడు కాదని అది ఒక మహా డ్రామా అని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మేయర్ రామయ్య మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మద్దయ్య అన్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆ రాష్ట్ర పరిపాలన కేంద్రం అమరావతిలో పేద ప్రజలకు ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాల గురించి టిడిపి నేత నారా చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. బిడ్డనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తులే నీతులు బోధించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎలక్షన్ల ముందు ఎన్టీఆర్ ఫోటోను ఉంచుకొని తరువాత ఫోటోను విసిరిపారేసే నీచ వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడుదని అన్నారు. హరికృష్ణ దగ్గుపాటి వెంకటేశ్వరరావు జూనియర్ ఎన్టీఆర్ లను సొంత బంధువులను తన స్వార్ధ రాజకీయం కోసం వెలివేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉన్న గత కేంద్ర ప్రభుత్వాలతో అంటకాగిన బాబుకు ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఆలోచన నాడు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. బతికినప్పుడు కూడు పెట్టకుండా చంపి చచ్చాక పల్లకిలో ఊరేగిచ్చిన చందంగా ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు వ్యవహారం ఉందన్నారు. చంద్రబాబు వెన్నుపోటుదారుడు అని మోసకారి అని అబద్దాలకోరు అని విమర్శించారు. అమరావతిలో పెద్దల సామ్రాజ్యాన్ని నిర్మించాలని టిడిపి చూసిందన్నారు. సామాజిక సమానత్వంతోనే నిజమైన స్వాతంత్రం లభిస్తుందని విశ్వసించి, ఆచరించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదల అభివృద్ధి ఆయన లక్ష్యమని చెప్పారు. అమరావతిలో పేదలకు ఇచ్చిన పట్టాల విషయంలో ఏకంగా సుప్రీంకోర్టు సమర్థిస్తే అవి హక్కులు లేని పట్టాలని, చెల్లనివని, రద్దవుతాయని చెప్పడం టిడిపి నాయకుల అవివేకం అన్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు ఉద్దేశించి రోశయ్య చేసిన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటు చరిత్ర గురించి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. మహానాడు భోజనాల అభిరుచులు, విమర్శలకు తప్ప పేద ప్రజల అభివృద్ధి గురించి చర్చ శూన్యమన్నారు. భవిష్యత్తు రాజకీయ వారసుడు జగనన్నని రాబోయే ఎన్నికల్లో గెలిచేది వైసీపీ నని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ జిల్లా చైర్మన్ సుభాష్ చంద్రబోస్, వైసిపి మహిళా విభాగం జోనల్ ఇన్చార్జి గాజుల శ్వేతారెడ్డి, వైసీపీ బీసీ సెల్ నాయకులు బత్తుల లక్ష్మీకాంతయ్య, దేవ పూజ ధనుంజయ, ఎర్ర సత్యం, తదితరులు పాల్గొన్నారు.










