Apr 26,2023 12:57
  • చంద్రబాబుకు విజ్ఞత లేదన్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 

ప్రజాశక్తి-పెదకూరపాడు : అవినీతి చేసి ఓటమి పాలైన వాళ్లు తనపై ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే  స్పందించారు. 2014 నుంచి 2019 వరకు పెదకూరపాడులో 1100 కోట్లతో అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ 100 కోట్లతో ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. తాను నాలుగేళ్లలో 1377 కోట్లతో సంక్షేమ పథకాలు, 655 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని.. వాటి లెక్కలు చెప్పేందుక తాను సిద్ధమని.. టీడీపీ అభివృద్ధి చేశామంటున్న రూ.1100 కోట్ల అభివృద్ధి వివరాలు చెప్పగలరా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఇసుక తవ్వకాల వల్ల 28 మంది చనిపోతే.. చంద్రబాబు.. ఆ పాపం తనకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ రూ.100 కోట్లు ఫైన్ వేసింది టీడీపీ హయాంలోనే అన్న విషయం చంద్రబాబు మర్చిపోయారన్నారు. ఇటీవల అమరావతి మండలంలో ఇద్దరు చనిపోవడానికి కారణం.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి చేసిన ఇసుక తవ్వకాల వల్లేనని చెప్పారు. పెదకూరపాడు నియోజవకర్గంలో అమరావతి  - బెల్లంకొండ డబుల్ లేన్ రోడ్డు తాము వేస్తున్నామని.. అమరావతి - తుళ్లూరు రోడ్డు తామే వేస్తున్నామని చెప్పారు. ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పెదమద్దూరు బ్రిడ్జి నిర్మాణ పనులు కనిపించలేదా అని ప్రశ్నించారు. అలాగే కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు తెచ్చి.. త్వరలో నిర్మాణం చేపట్టబోతున్నామన్నారు. అభివృద్ధి చేయలేదంటున్న చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు వయసుతో పాటు చాదస్తం పెరిగిందన్న శంకరరావు... తన పేరును కూడా అవమానపరిచేవిధంగా మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేసే స్థాయికి చంద్రబాబు దిగజారాడని మండిపడ్డారు. చినపిచ్చయ్య అందించిన అబద్ధపు వివరాలతో పెదపిచ్చయ్య తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు. చంద్రబాబు అమరావతి పర్యటన పెద్ద ఫెయిల్ అని.. జనం రాకపోవడంతో ప్రస్టేషన్ లో విజ్ఞత మర్చిపోయి మాట్లాడారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని మళ్లీ చెబుతున్నారని.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో సచివాలయ ఉద్యోగాలు, పోలీస్, డీఎస్సీ 98 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. జగనన్న పాలనలో ఆదాయం లేదంటున్న చంద్రబాబుకు.. జీడీపీ, జీఎస్టీల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉన్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు.  రైతులకు, మహిళలకు రుణమాఫీ పేరుతో మాయమాటలు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జనంలోకి వస్తున్నారన్నారు. గతంలో విజన్ 2020 అని ప్రజలను మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు విజన్ 2047 అనడంపై జనమే నవ్వుకుంటున్నారన్నారు.