
అనంతపురం జిల్లా లోని నీటి రిజర్వాయర్లన్నీ నిండు కుండలా వున్నాయి. అనేక దశాబ్దాల తర్వాత జలాశయాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. వంద సంవత్సరాల తర్వాత వేదవతి నదికి వరదలు వచ్చాయి. సుమారు 40 ఏళ్ళలో ఎప్పుడూ లేనంతగా పెన్నా నది ప్రవహిస్తున్నది. చిత్రావతి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా కనీస అవసరాలకు సరిపడా నీళ్ళకు నోచుకొని జిల్లా వాసులు నిండుగా పారుతున్న నీటిని కళ్లారా చూసేందుకు తిరణాళ్ళకు వచ్చినట్లుగా ఈ రిజర్వాయర్ల దగ్గరకు తరలి వస్తున్నారు. ప్రజలను నివారించేందుకు రిజర్వాయర్ల దగ్గర రోడ్లకు పోలీసులు ముళ్లకంపలు అడ్డం వేయించారు. అయితే ఈ ఆనందమంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. నాణేనికి మరోవైపు విషాదం వుంది. జిల్లా లోని వందలాది చెరువులు, కుంటల్లో నీరు లేక ఒట్టిపోయాయి. రిజర్వాయర్ల లోకి వచ్చిన నీటిని నిలుపుకొనే సామర్థ్యం, నిర్వహణ పద్ధతులు లేకపోవడంతో గత రెండు వారాల్లో 15 నుండి 18 టిఎంసిల నీరు వృధాగా తరలిపోవడం ఆందోళనకరం. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది. ఎవరు దీనికి కారణం? పరిష్కారాలు ఏమిటి?
ఈ పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రతినిధి బృందం శని, ఆదివారాల్లో రిజర్వాయర్ల దగ్గర ప్రాంతాలను పర్యటించి, అధికారులతో, స్థానిక ప్రజలతో చర్చించింది. చెరువుల ఎండి పోవడానికి, రిజర్వాయర్ల నుండి నీరు వృధాగా వెళ్లిపోవడానికి కారణాలను, దీనివల్ల జరిగిన పంట నష్టం, ఇరిగేషన్ సిబ్బంది సమస్యలను పరిశీలించింది.
- జిల్లా సాగు నీటి వనరులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వున్న 27 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో కేవలం మూడు నుండి మూడున్నర లక్షల ఎకరాల భూమి మాత్రమే నమ్మదగిన సాగు నీటి కింద ఉన్నది. జాతీయ ఇరిగేషన్ కమిషన్ 1972 నివేదిక ప్రకారం ఒక ప్రాంతంలో వ్యవసాయం లాభసాటిగా వుండాలంటే 30 శాతం నమ్మదగిన సాగునీటి సౌకర్యం వుండాలన్నారు. ఈ కమిషన్ సూచనల మేరకు నదీ జలాల కేటాయింపులో అత్యంత ప్రాధాన్యత కల్పించవలసిన జిల్లాగా అనంతపురంను గుర్తించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర కాలంలో నిర్మించిన తుంగభద్ర డ్యాం నుండి ఎగువ కాలువ ద్వారా జిల్లాకు వచ్చే 21.73 టిఎంసిలు మాత్రమే నికరమైన సాగునీరు. ఇందులో నుండే కాలక్రమంలో తాగునీటి అవసరాల కోసం 10 టిఎంసిలు కేటాయించారు. మిగిలింది 11.73 టిఎంసిలు. ఈ కొద్దిపాటి నీటితో వ్యవసాయం అభివృద్ధి చెందడం ఎలా సాధ్యం? హంద్రీ-నీవా కాలువ ద్వారా వచ్చే నీటితో మొదటి దశలో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తామన్నారు. రెండవ దశ పూర్తి చేసి జిల్లా నుండి కరువును శాశ్వతంగా పారదోలుతామని కాంగ్రెస్, టిడిపి, వైసిపి పార్టీలు పోటీలు పడి ప్రకటించాయి. ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదంటే వీరి మాటలకు చేతలకు ఎంత వ్యత్యాసం వుంటుందో అంచనా వేయగలం. గత ఆరేడు సంవత్సరాలుగా హంద్రీ-నీవా ద్వారా వస్తున్న పదుల టిఎంసిల నీటితో చెరువులు, కుంటలు నింపి గంగమ్మ పూజలు చేసి ఓట్లు దండుకునే పథకంగా దిగజార్చేశారు.
- పాలకుల నిర్లక్ష్యం
కారణాలు ఏమైనా గత రెండు సంవత్సరాలుగా జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అలాగే జిల్లాకు పైభాగాన వున్న కర్ణాటకలో కురుస్తున్న వర్షాల వల్ల తుంగభద్ర ఎగువ కాల్వకు వరద నీరు ఎక్కువగా వస్తున్నది. ఈ కాలువ మీద ఆధారపడిన పెన్న, అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మిడ్ పెన్నార్, చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్లకు నీటి రాక పెరిగింది. పది, ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి వరదలు వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా ఇలాంటి వరదలు వచ్చాయి. అయితే ఏ రిజర్వాయరులో కూడా నిర్ణయించిన నీటి సామర్ధ్యాన్ని నిలుపుచేయలేకపోయారు. 1994లో నిర్మించిన పెన్న అహోబిలం రిజర్వాయర్‌కు 11.10 టిఎంసిల సామర్థ్యం వుంది. అయితే అంత నీటిని నిలుపుకునే భూమిని సేకరించలేదు. ఆరు టిఎంసిల కంటే ఎక్కువ నీరు పెట్టుకునే అవకాశం లేదు. ఇప్పటికీ అందుకు అవసరమైన భూ సేకరణ చేయడంలేదు. అలాగే చాగల్లు రిజర్వాయర్ సామర్థ్యం 1.5 టిఎంసిలు కాగా ప్రస్తుతం అర టిఎంసి మాత్రమే నిలుపుదల చేశారు. ఇక్కడ కూడా భూసేకరణ, ముంపు గ్రామాలకు పరిహారం ఇవ్వకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. జిల్లాకు ఏకైక నికర సాగునీటి ఆధారమైన తుంగభద్ర హైలెవల్ కెనాల్ కర్ణాటకలో ప్రవహిస్తూ 105 కి.మీ వద్ద అనంతపుం జిల్లా లోకి ప్రవేశిస్తుంది. ఈ కాలువ ఆధునీకరణ పనులను రూ. 458.42 కోట్లతో 2008లో ప్రారంభించారు. పద్నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికీ జిల్లాలో 84 కి.మీ కాలువ పనులు ఆధునీకరించలేకపోయారు. జిల్లా నీటి వనరుల పట్ల ప్రభుత్వాలలో కొరవడిన చిత్తశుద్ధికి నిలువెత్తు నిదర్శనమిది.
- ఎండిపోయిన చెరువులు
ఒకవైపు నీరు పొంగిపోతుంటే మరోవైపు నీరు లేక చెరువులు ఎండిపోవడం వింతల్లోకెల్ల వింత. పుట్లూరు మండలంలోని పుట్లూరు, కొమటికుంట్ల, గరుగుచింతరపల్లి, శింగనమల మండలం సలకం చెరువు, రాచేపల్లి తదితర చెరువులు నీటి కోసం బీళ్ళుబారి పోయాయి. 4 వేల ఎకరాల ఆయకట్టు వున్న శింగనమల చెరువు గత పది రోజులకు పైగా పూర్తిగా నిండిపోయి కిందకు పారుతున్నది. ఈ ఆయకట్టులో ఒక్క ఎకరా సాగు కాలేదు. నికరమైన నీటి కేటాయింపులు లేకపోవడంతో రైతులు వరి విత్తనం వేసుకోలేదు. కొందరు ఆశతో వేసే ప్రయత్నం చేసినప్పటికీ... అధికారులు నీళ్ళు రావని అడ్డుకున్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలో చాలా చోట్ల వుంది. ఉమ్మడి జిల్లాలో 3,300 జనావాస గ్రామాలు వుంటే 7,000 కుంటలు, చెరువులు వున్నాయి. వీటిలో అత్యధికం విజయనగర రాజుల కాలంలో నిర్మించినవి. ఆ కాలం నాటికే నీటి కొరతతో ఇక్కడి ప్రజలు ఎంతగా అల్లాడిపోయారో 13, 14వ శతాబ్దాలకు చెందిన అనేక శాసనాలు చెబుతున్నాయి. తాతల కాలం నాడు నిర్మించిన చెరువులు, కుంటలను రిజర్వాయర్లతో అనుసంధానం చేసి కనీసం వరద నీటినైనా సక్రమంగా ఉపయోగించుకోవాలనే ప్రయత్నం చేయకపోవడం ఎంత దుర్మార్గం?
- తక్షణం చేపట్టాల్సిన పరిష్కార చర్యలు
1. పదొకండు టిఎంసిల సామర్ధ్యంతో నిర్మించిన పిఎబిఆర్ డ్యాంలో పూర్తి స్థాయిలో నీటి నిల్వకు అవసరమైన భూమిని వెంటనే సేకరించాలి. అందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయించాలి. 2. రాయదుర్గం ప్రాంతంలో ఉంతకల్లు వద్ద పది టిఎంసిల సామర్థ్యంతో రిజర్వాయర్ ఏర్పాటు చేసి వరద నీటిని నిల్వ చేసుకోవాలి. 3. హెచ్‌ఎల్‌సి కాల్వ ఆధునీకరణ పనులు వెంటనే పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు, సిబ్బందిని కేటాయించాలి. 4. హంద్రీ-నీవా, భైరవాని తిప్ప, చాగల్లు, పేరూరు డ్యామ్ లలో నీరు వున్న ఆయకట్టుకు అందివ్వాల్సిన పిల్ల కాల్వల నిర్మాణం దశాబ్దాలు గడిచినా ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు ఉపయోగం లేకుండా పోతుంది. తక్షణం పిల్ల కాల్వల నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయాలి. 5. చెరువులు, కుంటలకు రిజర్వాయర్లను అనుసంధానం చేసి, వాటి మరమ్మతులు సకాలంలో పూర్తి చేసి వరద నీటిని నిలుపుకునేందుకు ప్రణాళిక రూపొందించాలి. 6. రిజర్వాయర్ల నుండి అకస్మాత్తుగా నీరు వదలడం వల్ల సుమారు ఐదు వేల ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోయాయి. నిష్పక్షపాతంగా పంట నష్టం అంచనా వేసి పంటల ఆధారంగా పరిహారం చెల్లించాలి.7. రిజర్వాయర్లలో పని చేస్తున్న ఇరిగేషన్ కాంట్రాక్టు సిబ్బందికి గత ముప్పై నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదు. వారికి వేతనాలు ఇవ్వకుండా రిజర్వాయర్ల నిర్వహణ అసాధ్యం. బకాయి వేతనాలు చెల్లించడంతోపాటు, వారిని శాశ్వత కార్మికులుగా గుర్తించాలి.
పై అంశాల సాధనకు ప్రజా ఉద్యమమే మార్గం. 2009కి ముందు జిల్లాకు వచ్చిన వరుస కరువుల నుండి ప్రజలను కాపాడుకునేందుకు సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గంజి, అంబలి కేంద్రాలు నిర్వహిస్తూనే, శాశ్వత నివారణ చర్యల కోసం 'అనంత ప్రస్థానం' పేరుతో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించింది. ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. కమ్యూనిస్టుల ఒత్తిడి మేరకు జిల్లాకు హంద్రీ-నీవా నీరు వచ్చింది. హెచ్‌ఎల్‌సి ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. వరద నీరు నిలపుకునేందుకు అవసరమైన శాశ్వత చర్యల కోసం మరో ఉద్యమం ప్రారంభం కావాలి. అందుకోసం సిపిఎం చేపట్టే ఉద్యమాలకు జిల్లా ప్రజలు, ప్రజాతంత్ర వాదులు అండగా నిలవాలి.
వి.రాంభూపాల్,
(వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు).