
రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి బుధవారం వరకు విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం నిర్వహించింది. సంక్షేమ పాలన అందించేందుకు, ప్రజలకు ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, సుఖ సంతోషాల కోసం, మొత్తంగా లోకకళ్యాణార్ధం మహా యజ్ఞాన్ని తలపెట్టామని సర్కారు తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఒకటికి పదిసార్లు వల్లె వేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు యజ్ఞాన్ని సందర్శించారు. కాగా ఒక మతపరమైన క్రతువును ప్రభుత్వం నిర్వహించడం మన రాజ్యాంగం అనుమతించదు. భారత రాజ్యాంగానికి పునాది లౌకికవాదం. అన్ని మతాల, జాతుల, కులాల, ప్రాంతాల వారి సమాహారం మన దేశం. వారందరి స్వేచ్ఛాయుత జీవనానికి ఆధారం లౌకిక తత్వమే. విభిన్న ప్రజలను దండలో దారం మాదిరి కలిపి ఉంచేది లౌకికవాదమే. రాజ్యం నుంచి మతాన్ని వేరుచేసేదే సెక్యులరిజం. ప్రభుత్వాలు ఏ ఒక్క మతాన్నో భుజానేసుకోరాదు. ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండరాదు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకొచ్చిన వైసిపి ప్రభుత్వం ఒక మతాచారమైన యజ్ఞాన్ని నిర్వహించడం రాజ్యాంగ ఉల్లంఘన. లౌకికవాద స్ఫూర్తికి విఘాతం. ఆరు రోజుల యజ్ఞ ఆర్భాటాన్ని చూస్తే ఈ విషయాలు కనీసమాత్రం ప్రభుత్వ మననంలో లేవనిపిస్తుంది.
రాజులు మునులతో యజ్ఞాలు నిర్వహించగా, దేవాదాయశాఖ ద్వారా తమ ప్రభుత్వం శ్రీలక్ష్మీ యజ్ఞాన్ని చేయిస్తున్నామని సమర్ధించుకుంటోంది ప్రభుత్వం. తామే దైవాంశ సంభూతులమని రాజులు చెప్పుకున్నారు కనుక వారు ఏం చేసినా అడగటానికి లేదు. ప్రస్తుతం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలందరిదీ ప్రభుత్వం. అలాంటప్పుడు ప్రజలందరూ చెల్లించే పన్నులతో ఒక మతానికి చెందిన క్రతువు నిర్వహించడం చెల్లదు. తామే మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజల డబ్బుతో యాగం చేయడాన్ని సైతం ప్రజాస్వామ్యం అంగీకరించదు. ప్రభుత్వం యజ్ఞానికే పరిమితం కాలేదు. ఉద్యమంలా ప్రచారం కల్పించింది. వివిధ జిల్లాల నుంచి భక్తులను వేసవి వడగాడ్పుల్లో తరలించింది. సమీకరణకు 30 దేవాలయాలకు టార్గెట్లు విధించింది. బస్సులకు, ఇతర ఖర్చులకు ఆయా గుళ్ల ఆదాయం నుంచి వ్యయం చేయాలని అధికారులను పురమాయించింది. ఏడు ప్రధాన ఆలయాల ఆదాయం నుంచి రూ.లక్షలు సమీకరించింది. ప్రభుత్వ ఖజానా నుంచి నయాపైసా ఇవ్వకుండా ఆలయాల నిధులు తీసుకుంది. ఆలయాలకు ఒక్క మతం వారే కానుకలు, విరాళాలు ఇవ్వరు. అన్ని మతాల వారూ ఉంటారు. ఆలయాల భూములు, దుకాణాల నుంచి వచ్చే లీజులు, అద్దెలు అందరివీ. వాటిని ఆలయాల్లో పని చేసే వారి జీతభత్యాలకు, సంక్షేమానికి ఖర్చు చేయడమే నిజమైన సంక్షేమం. కానీ ఆ సొమ్మును యజ్ఞం కోసం కూడేసి దాని ద్వారా లభించే ప్రచారంతో ప్రభుత్వం లబ్ధి పొందడం అన్యాయం.
యజ్ఞ నిర్వహణ సందర్భంగా చేసిన ఖర్చుల్లో అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. టెండర్ల ద్వారా రాజస్థాన్ నుంచి తెప్పించామంటున్న నెయ్యి ఖరీదు, బహిరంగ మార్కెట్ ధర కంటే చాలా ఎక్కువ. భోజనాల టెండర్లలోనూ చేతివాటం చూపారంటున్నారు. యజ్ఞ సంకల్ప ఫల సిద్ధి సంగతేమోకానీ, యజ్ఞం వలన కొందరి జేబులు నిండాయని తెలుస్తుంది. పక్కదారి పట్టింది ప్రజాధనమే. మంత్రాలకు చింతకాయలు రాలవన్నది యథార్ధం. శాస్త్ర విజ్ఞానం, మానవ కృషి మాత్రమే అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి మూలం. లౌకిక ప్రభుత్వం యజ్ఞ యాగాలు చేయడం సమస్యల్లో ఉన్న ప్రజలకు వాస్తవం, హేతువు తెలియనీకుండా తప్పుదారి పట్టించడానికే. ఆ విషయంలో బిజెపి ముందుంటుంది. రాష్ట్రంలో గతంలోనూ వర్షాల కోసం యజ్ఞాలు, దివిసీమలో పాముకాట్ల నివారణకు సర్పయాగాలు జరిగాయి. కేంద్రంలో బిజెపి వచ్చాక మూఢ నమ్మకాలు, అభూత కల్పనల ప్రచారం, సైన్స్‌పై దాడి, చరిత్ర వక్రీకరణ ఎక్కువైంది. లౌకికత్వంపై సైద్ధాంతిక దాడిని ఎక్కుపెట్టింది. ఈ తరుణంలో లౌకిక ప్రభుత్వాలు ఏం చేయాలో, ఏం చేయకూడదో విస్పష్ట మార్గదర్శకాల నియమావళి రూపొందించుకొని ఆచరించాలి. అదే అసలు సిసలు లోకకళ్యాణం.