Jun 18,2023 12:10

న్యూఢిల్లీ :   పెద్ద మొత్తంలో కనిపించకుండా పోయిన రూ. 500 నోట్లపై వచ్చిన మీడియా కథనాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పందించింది. రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్లు కనిపించకుండా పోయాయంటూ మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆర్‌బిఐ పేర్కొంది. సమాచార హక్కు (ఆర్‌టిఐ) నుండి వచ్చిన సమాచారం ఆధారంగా రూ. 500 కొత్త నోట్లు 'తప్పిపోయాయని' మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రభుత్వ నోట్‌ ప్రెస్‌ 881.06 కోట్ల కొత్త నోట్లను ముద్రించిందని, అయితే 726 కోట్ల నోట్లు మాత్రమే ఆర్‌బిఐకి చేరాయని ఆర్‌టిఐలో పేర్కొన్నారు.

ఈ అంశంపై ఆర్‌బిఐ సమాధానమిస్తూ.. ఆర్‌టిఐలో ఇచ్చిన సమాచారం సరైనది కాదని సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది. అవి తప్పుడు వివరణ ఆధారంగా ఇచ్చిన నివేదికలని శనివారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రింటింగ్‌ ప్రెస్‌ల నుండి సమాచార హక్కు చట్టం, 2005 కింద సేకరించిన సమాచారం తప్పు వివరణ ఆధారంగా నివేదికలను రూపొందించారని పేర్కొంది.

ప్రెస్‌ నుండి ఆర్‌బిఐకి నోట్ల సరఫరాకి బలమైన వ్యవస్థ ఉంది. ప్రెస్‌ నుంచి బ్యాంకుకు వచ్చిన ప్రతి నోటుకు లెక్క ఉంటుంది. ఇందులో నోట్ల ముద్రణే కాకుండా వాటి నిల్వ, పంపిణీకి సంబంధించిన సమాచారం కూడా దఅఢంగా ఉంచుతారు. ఆర్‌బిఐ స్వయంగా తన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటుంది అని సెంట్రల్‌ బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ యోగేష్‌ దయాల్‌ సంతకం చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.