ప్రజాశక్తి-కాకినాడ : ఉగ్రవాద యుద్ధాల వలన మానవాళికి పెనుముప్పు వాటిల్లుతుందని ప్రపంచ శాంతి సమాఖ్య పేర్కొంది. పాలస్తీనా జాతి నిర్మూలనకై జరుగుతున్న దాడులు మానవ ప్రగతికి అనర్ధదాయకమని సమాఖ్య కాకినాడ కమిటీ పేర్కొంది. ఈమేరకు ప్రపంచ శాంతి స్పూర్తితో పాలస్తీనా ఇజ్రాయిల్ యుద్ద పూర్వపరాలపై ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య వక్తగా నవంబర్ 6వ తేదీ సోమవారం ఇంద్రపాలెం లాకులు వద్ద యుటిఎఫ్ మీటింగ్ హాలులో సాయంత్రం 5గంటలకు శాంతి సమాఖ్య సదస్సు నిర్వహిస్తున్నదని సామాజికవేత్త దూసర్ల పూడి రమణరాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గాంధీనగర్ పార్కులో మహత్మా విగ్రహం వద్ద శాంతిసదస్సు ఫ్లెక్సీ పోస్టర్ ను సమాఖ్య ప్రధాన ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పప్పు దుర్గారమేష్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పిట్టా వర ప్రసాద్, ట్రేడ్ యూనియన్ లీడర్ పెద్దింశెట్టి రామకృష్ణ, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, మాజీ ఎన్జివో నాయకులు గోపు చెల్లారావు, ఉద్యోగ సంఘ నాయకులు వి రవికుమార్, హమాజ్ జిల్లా కన్వీనర్ ఇబ్రహీం, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రతినిధి అయినాపురపు సూర్యనారాయణ పాల్గొన్నారు. సదస్సుకు యువజన, మహిళా, కార్మిక, ఉద్యోగ, ప్రజాసంఘాలు యావన్మంది పాల్గొనాలని వారు కోరారు.










