మన శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్, ఆహారం అవసరం. అలాగే శరీరంలోని కార్బన్ డయాక్సైడ్, మలిన పదార్థాల్ని ఎప్పటికప్పుడు తొలగించాల్సిన అవసరం ఉంది. గుండె కొట్టుకొంటూండడంతో రక్తం శరీర భాగాలన్నింటికీ వెళ్ళడం, అక్కడ నుంచి వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది. ఇలా గుండె ఒక పద్ధతి ప్రకారం కొట్టుకుంటుండాలంటే దాని నిర్మాణంలో లోపాలుండకూడదు. కండరాలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. కవాటాలు సరిగా పనిచేయాలి. అప్పుడే గుండె కండరాలకు రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. గుండెలోని శక్తి ప్రవాహం కూడా పద్ధతిగా ఉండాలి. అప్పుడే గుండె 'లబ్ డబ్' అంటూ సరి వేగంతో కొట్టుకుంటుంది. లేకుంటే సమస్యలు వస్తుంటాయి. వాటిని ముందుగా గుర్తించి వైద్యం తీసుకుని గుండెను జాగ్రత్తగా చూసుకోవాలి.
- చిన్న పిల్లల్లో గుండె సమస్యలు
గుండె చుట్టూ ఉండే రక్షక పొరని 'పెరికార్డియమ్' అంటారు. దీనిలో ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు గుండె చుట్టూ నీరు చేరుతుంది. దాంతో ఛాతీ ప్రాంతంలో నొప్పి వస్తుంది. గుండె కండరాలు బలహీనమై గుండె కొట్టుకోవడం కష్టమవుతుంది. ఇలా వదిలేస్తే 'హార్ట్ ఫెయిల్యూర్'కి దారితీస్తుంది. గుండెలోని ఒక పక్కవున్న గదుల ద్వారా ఆక్సిజన్‌తో కూడుకున్న రక్తం శరీర భాగాలకి వెళ్తే, రెండో పక్కనున్న గదుల్లోకి కార్బన్ డయాక్సైడ్‌తో కూడుకున్న రక్తం శరీర భాగాల నుంచి చేరుతుంది. అందుకే రెండు పక్కల రక్తనాళాలు కలవకుండా ఉండాలి. అలాగే రక్తం ఒక వైపే ప్రవహిస్తుండాలి. ఇందుకు కవాటాలు తోడ్పడుతుంటాయి. వీటిలో లోపమున్నా గుండె గోడలో రంధ్రాలున్నా ఈ సమతుల్యం దెబ్బతిని గుండె నీరసించే ప్రమాదముంది. ఇలాంటి సమస్యలు పుట్టుకతోనూ, చిన్నతనంలో రుమాటిక్ జ్వరం రావడంవల్ల ఎదురవుతాయి. గుండెలో రంధ్రాలతోపాటు కవాటాలు మూసుకుపోయి పుట్టిన పిల్లల్లో చెడు, మంచి రక్తం కలవడంతో 'సైనోటిక్ హార్ట్ డిసీజెస్' రావొచ్చు. వీళ్లనే 'బ్లూ బేబీస్' అంటారు. రక్తం నీలంగా మారడంవల్ల పిల్లలు నీలంగా కనిపిస్తారు. పుట్టుకతో వచ్చే ఈ లోపాలన్నింటినీ శస్త్ర చికిత్సతో సరిదిద్దవచ్చు. 6 - 12 ఏళ్ల వయసు మధ్య గొంతు ఇన్‌ఫెక్షన్స్ (ఫెరింజైటిస్) వచ్చినప్పుడు అశ్రద్ధ చేస్తే- కీళ్ళ నొప్పులు, జ్వరంతో కూడిన 'రుమాటిక్ ఫీవర్' అనే వ్యాధి వస్తుంది. వెంటనే వైద్యులకు చూపించి, సరైన చికిత్స చేయించాలి.
- గుండెకి మూలకణ చికిత్సలు
గుండె ఇన్‌వాలంటరీగా పనిచేసే కండరాలతో ఆగకుండా అలా కొట్టుకుంటుంది. మన శరీరంలో ఇలాంటి కండరాలు మరెక్కడా లేవు. గర్భంలోని శిశువుకు 21 రోజు వయసు వచ్చేసరికి గుండె ఏర్పడడమే కాదు, కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. గర్భంలో ఆడ, మగ గుండె కొట్టుకునే రేట్లలో తేడా ఉంటుంది. గర్భంలో శిశువు పెరిగే క్రమంలో వారాల నుంచి గుండె కొట్టుకునే వేగంలో మార్పులు ఉంటాయి. శిశువు గర్భంలో ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ లాంటి పరీక్షలతో గుండె లోపాలుంటే తెలుసుకోవచ్చు. కవాటాల లోపాలు లాంటి వాటిని శిశువు చుట్టూవున్న మూల కణాల్ని తీసి, కావలసిన సంఖ్యకి లేబరేటరీలో పెంచి ఈ కవాటాన్ని కవాట లోపమున్న శిశువుకు జన్మించగానే అమర్చవచ్చు. గుండె కండరాలు దెబ్బతింటే అదే వ్యక్తి బోన్‌మారో నుంచి మూలకణాలు తీసి లేబరేటరీలో కావలసిన సంఖ్యలోకి పెంచి, గుండె కండరాలలోకి ఎక్కించి, కండరాల్ని బలమయ్యేట్టు చేయవచ్చు. ఈ చికిత్స ఫలితం కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు. కొంతే అభివృద్ధి చెందితే మళ్ళీ ఆ ప్రాంతంలో మూల కణాల్ని పంపి మరికొంత అభివృద్ధి కనిపించేట్టు చేయవచ్చు. ఎవరి మూలకణాల్ని వారికే ఎక్కిస్తారు కాబట్టి, రోగ నిరోధక మందుల్ని జీవితాంతం వాడాల్సిన పనిలేదు.
- యాంజియోగ్రామ్
కరొనరి ధమనులు గుండెకి ఎడమవైపు రెండు, కుడివైపు ఒకటి ఉంటాయి. వీటి చుట్టూ కొవ్వు పదార్థాలు 50 శాతం కన్నా తక్కువ ఉంటే మందులతో కరిగించవచ్చు. 75 శాతం కన్నా ఎక్కువ ఉంటే యాంజియో ప్లాస్టి ద్వారా తొలగించవచ్చు. అసలు అడ్డంకుల్ని తెలుసుకోవడానికి 'యాంజియోగ్రామ్' తోడ్పడుతుంది. ఇప్పడు 'ఐవస్' గైడెన్స్ కేథలాబ్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా అమర్చిన స్టెంట్‌లు సరిగ్గా అమరాయా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. కష్టాన్ని కలిగించే అడ్డంకులకి బెలూన్ చికిత్స వల్ల లాభముందా? లేదా? తెలుసుకోవచ్చు. కాంప్లెక్స్ యాంజియో ప్లాస్టీలంటే ఎడమవైపు ఉండే ముఖ్య రక్తనాళంలో బ్లాక్‌లు, రక్తనాళాలు శాఖలుగా విభజన జరిగే ప్రాంతాల్లో అడ్డంకులు, బైపాస్ అయిపోయిన తర్వాత గ్రాఫ్ట్‌ల్లో అడ్డంకులు, గట్టి కార్డియం అడ్డంకుల్ని తొలగించడానికి నిర్వహించేవి. వీటికి ఐవస్ తోడ్పడుతుంది. మూడు రక్తనాళాలలో అడ్డంకులుంటే శస్తచ్రికిత్సతో తొలగించాల్సి రావచ్చు. ఈ శస్త్ర చికిత్సలో ఇప్పుడు సన్నటి రంధ్రం ద్వారా చేస్తున్నారు. కవాట మార్పిడి శస్తచ్రికిత్సల్ని చిన్న రంధ్రం ద్వారా చేస్తున్నారు. వ్యాధులు మొదలైనా ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే అపాయం కలగకుండా నివారించవచ్చు.
- ఎట్రియల్ ఫిబ్రిలేషన్
గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది. ఆ లయ రిథమ్ తప్పి కొట్టుకోవడాన్ని 'ఎరిధ్మియా' అంటారు. పైనుండే చిన్న రెండు గదులు - ఆరికల్స్‌లో కొట్టుకునే లయ తప్పడాన్ని 'ఏట్రియల్ ఫిబ్రిలేషన్' అంటారు. వయసుని బట్టి ఇది కనిపిస్తుంది. ఇది వచ్చినప్పుడు చెమటలు పట్టడం, ఛాతీ నొప్పి రావడం జరగొచ్చు. ఆరికల్స్ కదలికలు సరిగ్గా ఉండకపోతే రక్తం పేరుకుపోవడానికి 'స్టాసెస్' కారణమవుతుంది. దీనివల్ల రక్తం గడ్డ కట్టే రిస్క్ ఎక్కువ. ఈ బ్లడ్ క్లాట్స్, గుండెవైపు వెళ్ళి, అక్కడి రక్తనాళాలలో అడ్డంగా ఏర్పడవచ్చు. కొన్ని మందులతో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ తగ్గవచ్చు. గుండె కొట్టుకునే రేటు ఈ మందులతో తగ్గుతుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌లో గుండె కొట్టుకునే రేటుని ఎలక్ట్రిక్ కార్డియో వెర్షన్‌తో మామూలు స్థితికి రావచ్చు. ఇది తగ్గడానికి శస్తచ్రికిత్స, కేధటార్‌తో చేసే చికిత్సా విధానాలు తోడ్పడతాయి. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్‌తో బాధపడేవారు రక్తం పలుచనవడానికి మందులు తీసుకోవడం మంచిది.
- గుండె జబ్బులున్నవాళ్ళ ఆహారం
గుండె జబ్బులు ఉన్న వారు తీసుకునే ఆహారంలో కొవ్వు 7 శాతం మించరాదు. రెడ్‌మీట్ తినకూడదు. మనం ఆహారంగా తీసుకునే జీవులలోని అవయవాలలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినకూడదు. రొయ్యలు, పీతలు, గుడ్డులోని పచ్చ సొన, పాల పదార్థాలు లాంటి కొవ్వుని పెంచే పదార్థాల్ని పూర్తిగా మానేయాలి. ఒమెగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా వున్న చేపలు, బాదం పప్పు, అక్రూట్, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు లాంటివి ఆహారంలో తగు మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ముడి ధాన్యాలు, దంపుడు బియ్యం, ఓట్స్, గోధుమలు, సోయా పదార్థాలు, ఉల్లి, వెల్లుల్లి, మొక్కజొన్న, చిక్కుడు, కేరట్ లాంటి కూరగాయలు, నారింజ, యాపిల్, బేరి, అరటి, అంజీర్, ఆప్రికాట్స్‌లాంటి పళ్ళు తీసుకోవడం వల్ల గుండె జబ్బులను నివారించవచ్చు.
- అలవాట్లు మార్చుకోవాలి
శారీరక శ్రమ, తీసుకున్న కేలరీలు, అధిక ఒత్తిడి కారణంగా గుండె సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ విషయాలన్నింటి మీదా అవగాహన ఉండాలి. సైక్లింగ్, ఈత, నడక ఏదో ఒక వ్యాయామం రోజూ చేయాలి. ధూమపానం, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానుకోవాలి. ఆహారపుటలవాట్లు మార్చుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. వంశపారంపర్యంగా గుండె సమస్యలుంటే చిన్న వయసు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక వత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, సంగీతం వినడం, పుస్తక పఠనం లాంటివి అలవరచుకోవాలి. పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుకోవచ్చు. మాంసం, పాల పదార్థాల్లో శాచురేటెడ్ ఫాట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని బాగా తగ్గించాలి. ఉప్పుని కూడా తగ్గించి తీసుకోవాలి.
- పి.పెద్దేశ్వరరావు, కార్డియాలజిస్టు,
పెద్దేశ్వరరావు హార్ట్ కేర్ సెంటర్, డోర్నకల్ రోడ్డు, విజయవాడ.